బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (09:20 IST)

బాంబులిస్తే శత్రు శిబిరాలపై దాడి చేసి మట్టుబెడతా : రాఖీ సావంత్

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమంటూ జరిగితే భరతమాత కోసం ప్రాణాలు అర్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ప్రకటించింది. పంజాబ్‌లోని లూథియానాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ భారతమాత కోసం తాను చనిపోవడానికి సిద్ధమని ప్రకటించారు. 
 
తనకు 50 నుంచి 100 బాంబులు ఇస్తే, శత్రు శిబిరాల్లోకి దూసుకెళ్లి, వారిని మట్టుబెట్టి వస్తానని వెల్లడించింది. పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడి తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ సరైన చర్యలు తీసుకున్నారని అభిప్రాయపడింది. తాను కేంద్ర చర్యలను సమర్థిస్తున్నానని, పాకిస్థాన్‌కు సరైన సమాధానాన్నే ఇచ్చామని చెప్పింది. ప్రస్తుతం పాకిస్థాన్ అదుపులో ఉన్న పైలట్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.
 
కాగా, పుల్వామా ఉగ్రదాడి, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జైషే మొహ్మద్ ఉగ్రతండాలపై భారత్ వైమానిక దాడులు, పాకిస్థాన్ ప్రతిదాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ రెండు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చంటూ ప్రచారం సాగుతోంది. ఈ యుద్ధంలో తాను కూడా పాల్గొంటానని రాఖీ సావంత్ ప్రకటించారు.