బుధవారం, 6 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (18:42 IST)

భారత్-పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్.. అమ్మో అంత జనమా? (Video)

భారత్-పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్ తప్పక జరుగుతుందని, షెడ్యూల్‌లో మార్పు వుండదని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది. ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ కంటే.. భారత్-పాకిస్థాన్‌ జట్లు తలపడే మ్యాచ్‌ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారని తెలిసి ఐసీసీ షాకైంది. భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే క్రికెట్ ఫ్యాన్స్ మధ్య వున్న క్రేజే వేరు. అదీ ప్రపంచకప్ మ్యాచ్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 
 
దాయాది దేశాలైన ఈ రెండు దేశాలకు చెందిన క్రికెట్ జట్లు పోటీపడుతున్నాయంటే.. ప్రపంచమంతా ఆ మ్యాచ్‌ను వీక్షిస్తుంది. అయితే గత వారం పుల్వామా ఘటన నేపథ్యంలో భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌ జరుగుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో 2019 ప్రపంచ కప్ క్రికెట్ సిరీస్ ఇంగ్లండ్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రకటనా కార్యక్రమంలో పాల్గొన్న ఐసీసీ నిర్వాహక కార్యదర్శి స్టీవ్ ఎల్వోర్తి మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ కప్‌లో ఇతర జట్లు పాల్గొనే మ్యాచ్ కంటే.. భారత్-పాకిస్థాన్ జట్లు తలపడే మ్యాచ్ పట్ల ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. 
 
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ మాంచెస్టర్ నగరంలోని ఓల్ట్ స్టేడియంలో జరుగనుంది. ఈ మైదానంలో సీటింగ్ కెపాసిటీ 26000. కానీ ఇండో-పాక్ మ్యాచ్‌ను తిలకించేందుకు నాలుగు లక్షల మంది ఫ్యాన్స్ టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారని చెప్పారు. ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. వరల్డ్ కప్ ఫైనల్‌కు కూడా ఇంతమంది జనం టిక్కెట్ల కోసం ఎగబడట్లేదని స్టీవ్ వెల్లడించారు. ఫైనల్ మ్యాచ్ కోసం 2.7 లక్షల ఫ్యాన్స్ దరఖాస్తు చేసుకున్నారని స్టీవ్ చెప్పుకొచ్చారు.