బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (08:16 IST)

రామ్ గోపాల్ వర్మ మోస‌గాడు - అందుకే ముంబై నుంచి పారిపోయాడు - నట్టి కుమార్

Natti Kumar,
Natti Kumar,
రామ్ గోపాల్ వర్మ ప‌చ్చి మోస‌గాడు. సినిమా సినిమాకూ కొత్త నిర్మాత‌ల‌ను మారుస్తూ వారిని మోసం చేస్తుంటాడు. ఎంద‌రో బాధితులు ఆయ‌న‌బారిన ప‌డ్డారు. ముంబై నుంచి పారిపోయి ఇక్క‌డ‌కు రావ‌డానికి కార‌ణం కూడా అదే అంటూ ఎగ్జిబిట‌ర్‌, పంపిణీదారుడు, నిర్మాత న‌ట్టికుమార్ ధ్వ‌జ‌మెత్తారు.
 
రామ్ గోపాల్ వర్మ రూపొందించిన  తాజా సినిమా తెలుగులో  'మా ఇష్టం'  (డేంజరస్) , హిందీలో  'ఖత్రా'  సినిమా విడుదలపై కోర్టు స్టే ఇచ్చింది. ఈ చిత్రం శుక్రవారం విడుదల చేయాలని వర్మ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో సీనియర్ నిర్మాత నట్టి కుమార్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. లోగడ వర్మ తీసిన కొన్ని చిత్రాలకు ఆయనతో కలసి నట్టి కుమార్ భాగస్వామ్యం వహించడంతో పాటు కొన్ని సినిమాలకు తన స్నేహితులతో కలసి తాను కొంత డబ్బును ఫైనాన్స్ చేశారు. అయితే ఎన్నోమార్లు తమకు ఇవ్వాల్సిన డబ్బులు గురించి  వర్మ దగ్గర ప్రస్తావించినా లాభం లేకపోయిందని, ఎంతసేపు తప్పించుకుని తిరుగుతూ డబ్బులను ఎగగొట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు అర్ధమైందని గురువారం రాత్రి  హైదరాబాద్ లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేస్తిన ప్రెస్ మీట్లో నట్టి కుమార్ వెల్లడించారు. తనకు, తన స్నేహితులకు కలుపుకుని దాదాపు 5 కోట్ల 29 లక్షల రూపాయలు వర్మ బాకీ ఉన్నారని, తమకు రావలసిన ఈ డబ్బుల కోసం ఎంతోకాలం ఎదురుచూసి, కొన్ని సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రతీ సినిమాకు విడుదలకు ముందు 50 లక్షల రూపాయలు ఇస్తానని డాక్యూమెంట్ రాసి ఇచ్చిన వర్మ, చివరకు దానిపై కూడా నిలబడకుండా, 10 లక్షలు ఇస్తానంటూ, మా ఇష్టం సినిమా విడుదలకు ముందు రోజు వరకు ఆ ఊసే ఎత్తకుండా తన సినిమాను విడుదల చేసే పనిలో ఉండటంతో ఇక లాభం లేదనుకుని ఫిలిం చాంబర్స్ కు లెటర్స్ పెట్టినా ఫలితం లేకపోవడంతో తాను కోర్టుకు వెళ్లడం జరిగిందని అన్నారు. ఆ మేరకు కోర్టు మా ఇష్టం సినిమా విడుదలపై స్టే విధించిందని నట్టి కుమార్ చెప్పారు. వర్మ తీసిన " లఢఖీ" చిత్రంపై కూడా నట్టి కుమార్ ఇదివరకు స్టే తెచ్చిన విషయం తెలిసిందే. పుట్టిన రోజు సందర్భంగా గురువారం వర్మకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. 
 
తమలాగే వర్మ బాధితులు ఎందరో ఉన్నారని, అయితే వాళ్ళు బయటకు రాలేదని, తాను మాత్రమే దైర్యంగా ఆయన చేస్తున్న మోసాలను బయట పెడుతున్నట్లు నట్టి కుమార్ వివరించారు. అనేక సినీ యూనియన్ల వారికి కూడా ఆయన బాకీ ఉన్నారని చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లతో కలసి సినిమాలు, చేసి, వారిని ఆర్ధికంగా మోసగించడం వర్మ పనిగా పెట్టుకున్నారని నట్టి కుమార్ ఆరోపించారు. హైదరాబాద్ వదిలి, ముంబై, ఆ తర్వాత ముంబై, వదిలి తిరిగి హైదరాబాద్, గోవా చేరుకుని ఇక్కడి వాళ్ళను మోసగిస్తున్నారని ఆయన చెప్పారు. వర్మ ఎక్కడ చర్చకు వస్తాను అన్నా తాను సిద్ధమని నట్టి కుమార్ సవాల్ విసిరారు. ఒక వైపు కోర్టు మా ఇష్టం సినిమా విడుదలపై స్టే విధిస్తే, తాము సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు వర్మ చెప్పుకోవడాన్ని బట్టి ఆయన ఎలాంటి వ్యక్తి అన్నది అందరికీ అర్థమవుతోందని నట్టి కుమార్ నైజాన్ని వేలెత్తి చూపారు.