శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 2 ఏప్రియల్ 2022 (16:27 IST)

అంగ‌రంగ వైభ‌వంగా మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో ప్రారంభ‌మైన ర‌వితేజ‌, టైగర్ నాగేశ్వరరావు చిత్రం

Chiru clap
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న `టైగర్ నాగేశ్వరరావు` చిత్రం శ‌నివారం శుభ‌కృతు నామ సంవ‌త్స‌రం ఆరంభ‌మైన‌ ఉగాది ప‌ర్వ‌దినాన క‌నుల‌పండువ‌గా ప్రారంభ‌మైంది. క‌రోనా త‌ర్వాత క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో అంగ‌రంగ‌వైభంగా జ‌రిగిన ఈ వేడుక మాదాపూర్‌లోని నోవాటెల్‌లో (హెచ్‌ఐసిసిలో) జ‌రిగింది. పూజా కార్య‌క్ర‌మాలు అనంత‌రం  హీరో ర‌వితేజ‌, హీరోయిన్లు నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పుషాట్‌కు ముఖ్య అతిథి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్ట‌గా, కెమేరా స్విచ్చాన్ తేజ్ నారాయణ అగర్వాల్ చేశారు.  కిషన్ రెడ్డి  స్క్రిప్ట్‌ని అందజేసారు. క‌శ్మీర్ ఫైల్స్ ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
 
పిద‌ప టైగర్ నాగేశ్వరరావు ప్రీలుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను చిరంజీవి ఆవిష్క‌రించారు.
ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, శుభ‌కృతు నామ సంవ‌త్స‌రంలో అంద‌రికీ శుభాలు జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు. టైగర్ నాగేశ్వరరావు క‌థ‌ను పేండ‌మిక్ టైంలో ద‌ర్శ‌కుడు వంశీ నాకు క‌థ వినిపించారు. చాలా అద్భుతంగా నెరేట్ చేశారు. ఆ త‌ర్వాత నాకు సాధ్య‌ప‌డ‌లేదు. ఇప్పుడు నా త‌మ్ముడు ర‌వితేజ చేయ‌డం చాలా సంతోషంగా వుంది. ఈ స్టువ‌ర్ట్ పురం నాగేశ్వ‌ర‌రావు గురించి నేను చాలా చిన్న‌ప్పుడే విన్నాను. మా నాన్న‌గారు చీరాల‌ పేరాల‌లో ఉద్యోగం చేస్తుండేవారు. ఆ ప‌క్క‌నే స్టువ‌ర్ట్‌పురం వుండేది. అక్క‌డి వారంతా నాగేశ్వ‌ర‌రావుని హీరోగా కొనియాడుతుండేవారు. ఆస‌క్తితో నాన్న‌గారినుంచి చాలా విష‌యాలు తెలుసుకున్నాను. ఇన్నాళ్ళ త‌ర్వాత ఆయ‌న గురించి వంశీ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌గా తీర్చిదిద్దారు. త‌మ్ముడు ర‌వితేజ సినిమా చేయ‌డం శుభం. అందుకు అభిషేక్ అగ‌ర్వాల్ పూనుకోవ‌డం చాలా ఆనందంగా వుంది. ఇటీవ‌లే వారు క‌శ్మీర్ ఫైల్స్‌తో స‌క్సెస్ మూడ్‌లో వున్నారు.  కొత్త సంవ‌త్స‌రంలో పూర్త‌యి త్వ‌ర‌గా విడుద‌ల‌యి క‌శ్మీర్ ఫైల్స్ ఎంత హిట్ట‌యిందో అంత‌కంటే హిట్ అయి ర‌వితేజ‌కు, అభిషేక్‌కు, వంశీకి మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు. 
 
 చిత్ర హీరో ర‌వితేజ మాట్లాడుతూ, అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
Tiger team with chiru
హీరోయిన్ నూపుర్ సనన్ మాట్లాడుతూ, టైగర్ నాగేశ్వరరావు చిత్రం తెలుగులో నా మొద‌టి సినిమా. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో న‌టించ‌డం ఆనందంగా వుంది. ఉగాది పండుగ సంద‌ర్భంగా ప్రారంభం కావ‌డం మ‌రింత ఆనందంగా వుంది. నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాన‌ని తెలిపారు.
మ‌రో నాయిక గాయత్రి భరద్వాజ్  మాట్లాడుతూ,  ద‌క్షిణాదిలో తెలుగు సినిమాకు ప‌నిచేయ‌డం, అందులోనూ పాన్ ఇండియా సినిమాకు ప‌నిచేయ‌డంతో ఒళ్ళు పుల‌క‌రిస్తోంది. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌, హీరో, ద‌ర్శ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాన‌ని అన్నారు.
 
సంగీత ద‌ర్శ‌కుడు జీవి ప్ర‌కాష్ కుమార్ మాట్లాడుతూ, `ఆకాశం నీ హ‌ద్దురా` సినిమా త‌ర్వాత నేను తెలుగులో చేస్తున్న సినిమా ఇది. ఈ అవ‌కాశం ఇచ్చిన ర‌వితేజ‌, నిర్మాత అభిషేక్, ద‌ర్శ‌కుడు వంశీకి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా. ఇది నా చిత్రాలన్నంటిలోనూ భిన్న‌మైన సినిమా. పీరియాడిక్ మూవీ క‌నుక  త‌గిన బీజియ‌మ్స్‌ను ఇవ్వ‌బోతున్నా. బెస్ట్ మూవీ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను అన్నారు.
 
బి.జె.పి. నాయ‌కుడు కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ, జీవితంలో తీపి, చేదు, వ‌గ‌రు ఇలాంటి ఎన్నో అనుభూతులు క‌లిగించే ఉగాదినాడు టైగర్ నాగేశ్వరరావు చిత్రం ప్రారంభోత్స‌వం కావ‌డం ఆనందంగా వుంది. అభిషేక్ అగ‌ర్వాల్‌, వారి నాన్న‌గారు అనేక ఏళ్ళుగా కుటుంబ మిత్రులు. ఇటీవ‌లే వారు క‌శ్మీర్ ఫైల్స్ అనే సినిమా తీసి భార‌తీయులంద‌రికీ పండిట్‌ల క‌థ‌ను తెలిసేలా చేశారు. ద‌ర్శ‌కుడు వివేక్ సాధ్య‌మైన‌మేర‌కు క‌థ‌ను చూపించ‌గ‌లిగారు. ఇంకా చాలా విష‌యాలు పండిట్‌ల గురించి చ‌ర్చించాల్సి వుంది. చాలా మంది సినిమాలు తీస్తారు. దేశానికి ఉప‌యోప‌డే సినిమాలు కొన్నే వుంటాయి. ఉప‌యోగ‌ప‌డే సినిమా తీసిన అభిషేక్‌ను అభినందిస్తున్నా. ఇప్పుడు కూడా టైగర్ నాగేశ్వరరావు క‌థ‌ను తీస్తున్నారు. ఈ సినిమా కూడా విజ‌య‌వంతం కావాల‌ని భ‌గ‌వంతుడిని కోరుకుంటున్నాన‌ని అన్నారు. 
 
చిత్ర ద‌ర్శ‌కుడు వంశీ మాట్లాడుతూ, చిరంజీవిగారి చేతుల‌మీదుగా ప్రారంభోత్స‌వం జ‌ర‌గడం ఆనందంగా వుంది. ర‌వితేజ‌తో నాలుగేళ్ళుగా ప్ర‌యాణం చేశాను. ఈ క‌థ‌కు ఆయ‌నే బాగుంటుంద‌ని అనుకోవ‌డం, ఆయ‌న అందుకు ఒప్పుకోవ‌డంతో మాకు ఎంతో ఎన‌ర్జీ ఇచ్చారు. ర‌వితేజ ఫ్యాన్సేకాదు తెలుగు హీరోల ఫ్యాన్స్ కూడా మెచ్చే చిత్ర‌మ‌వుతుంద‌ని హామీ ఇస్తున్నాన‌ని తెలిపారు. 
 
చిత్ర నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ, అంద‌రికీ ఉగాధి శుభాకాంక్ష‌లు. చిరంజీవిగారు వ‌చ్చి ఆశీర్వ‌దించినందుకు ఆయ‌నకు థ్యాంక్స్ చెబుతున్నా. కిష‌న్ రెడ్డిగారికి ధ‌న్య‌వాదాలు. క‌శ్మీర్ ఫైల్స్‌ను హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటూ ఈ టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని కూడా ఆశీర్వ‌దిస్తార‌ని ఆశిస్తున్నాన‌ని అన్నారు. 
 
రేణుదేశాయ్ మాట్లాడుతూ, వంశీ 2019లో ఈ సినిమా క‌థ‌లోని పాత్ర గురించి చెప్పారు. ఆ టైంలో మ‌ర‌లా తెరపై క‌న్పించాల‌నే ఆలోచ‌న‌లేదు. కానీ పాత్ర బాగా న‌చ్చ‌డంతో చేయాల‌నే ఉత్సాహం క‌లిగింది. ద‌ర్శ‌కుడు వంశీ నాపై పూర్తి న‌మ్మ‌కంగా వున్నారు. ఇండియాలో గొప్ప ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకుంటాడ‌నే న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపారు. 
 
క‌శ్మీర్ ఫైల్స్ ద‌ర్శ‌కుడు వివేక్ అగ్ని హోత్రి మాట్లాడుతూ, గొప్ప సినిమాలు నిబ‌ద్ద‌తోనే వ‌స్తాయి. అందుకు సినిమా బాగా వ‌చ్చేలా నాకు తోడ్ప‌డిన అభిషేక్‌గారికి, వారి నాన్న‌గారికి ధ‌న్య‌వాదాలు తెలియజేసుకుంటున్నా. వంశీని గ‌త ఏడాది క‌లిశాను. ఆయ‌న నా సినిమాపై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నారు. నేను ఇప్పుడు ర‌వితేజ‌తో చేస్తున్న ఈ సినిమా కూడా అంత‌కంటే మ‌రింత న‌మ్మ‌కంతో వున్నాను. ఇండియ‌న్ చ‌రిత్ర‌లో క‌శ్మీర్ ఫైల్స్ 300 కోట్ల క్రాస్ చేసింది. ఈ సంద‌ర్భంగా టైగ‌ర్ అభిషేక్‌ను అభినందిస్తున్నాను అన్నారు.
 
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సినీరంగ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ర‌వితేజ‌తో సినిమాలు చేస్తున్న సుధీర్ వ‌ర్మ‌, శ‌ర‌త్ మండ‌వ‌, త్రినాథ్ న‌క్కిన‌, తేజ‌, విష్ణు త‌దిత‌రులు ఈ చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు.  
 
తారాగణం: రవితేజ, నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణుదేశాయ్‌, ముర‌ళీశ‌ర్మ‌, ష‌న్ముఖి.
 
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సమర్పకుడు: తేజ్ నారాయణ్ అగర్వాల్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
సంగీత దర్శకుడు: జివి ప్రకాష్ కుమార్
DOP: ఆర్ మదీ
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
PRO: వంశీ-శేఖర్