శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 26 మే 2019 (18:35 IST)

రాంగోపాల్ వర్మ తదుపరి చిత్రం "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు"

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తదుపరి చిత్రం పేరును ప్రకటించారు. ఆయన ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, తాను నిర్మించిన "లక్ష్మీస్ ఎన్టీఆర్" చిత్రం ఈ నెల 30వ తేదీన విడుదల అవుతుందన్నారు. అలాగే, తన తదుపరి చిత్రం "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" అని ప్రకటించారు. ఈ చిత్ర కథను ఇంకా రాయలేదని, ఇకపై రాస్తానని చెప్పారు. 
 
విజయవాడ వచ్చిన తర్వాతే తనకు ఈ స్టోరీ ఐడియా వచ్చిందన్నారు. విజయవాడ రాగానే బోయపాటి సినిమాలోలా సుమోలు తిరుగుతున్నాయని, కడపలో చూసిన రెడ్లంతా ఇక్కడే ఉన్నారంటూ నవ్వులు కురిపించారు. అందుకే, తనకు ఒక ఇన్సిపిరేషన్ వచ్చిందని, ఇక కథ రాయడం మొదలు పెడతానని వర్మ వ్యాఖ్యానించారు.
 
అలాగే, చిరంజీవి - పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రస్థానం గురించి స్పందిస్తూ, నాడు ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయని, నేడు జనసేన పార్టీకి ఒక్క సీటు మాత్రమే వచ్చిందని, 18 సీట్లు సంపాదించిన చిరంజీవి తన దృష్టిలో 'బాహుబలి'గా అభివర్ణించారు. 'జనసేన' తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన చిరంజీవి సోదరుడు నాగబాబు గురించి వర్మ వద్ద ప్రస్తావించగా, ఆయన ఎక్కడ నుంచి పోటీ చేశారో కూడా తనకు తెలియదని వర్మ చమత్కరించారు.
 
ఇకపోతే, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వివాదాస్పదం చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని చెప్పారు. ఈ చిత్రాన్ని తప్పని పరిస్థితుల్లో తీయాల్సి వచ్చిందన్నారు. ఈ చిత్రంలో నిజం చెప్పబోతున్నాననీ, కానీ, అది చాలా మందికి నచ్చలేదన్నారు. అందుకే ఈ చిత్రం విడుదల కాకుండా అడ్డుకున్నారన్నారు. అయితే, ఈ నెల 31వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు రాంగోపాల్ వర్మ వెల్లడించారు.