గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (14:42 IST)

మాట్లాడేందుకు ప్రయత్నించా... వాళ్లు బిజీగా ఉన్నట్టున్నారు.. : డీవీవీ దానయ్య

dvv danaiah
తెలుగు "ఆర్ఆర్ఆర్" చిత్రంలోని 'నాటు నాటు' పాటకు అవార్డు వచ్చింది. ఈ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య. ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు, సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, రాజమౌళి కుమారుడు కార్తికేయ మాత్రమే కనిపించారు. కానీ, చిత్ర నిర్మాత దానయ్య మాత్రం కంటి చూపు దరిదాపుల్లో కనిపించలేదు. పైగా, ఆయన పేరు కూడా ఎక్కడా వినిపించలేదు. 
 
ఈ నేపథ్యంలో తాను నిర్మించిన చిత్రంలోని పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై దానయ్య స్పందించారు. తెలుగు చిత్రానికి తొలిసారి ఆస్కార్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, గర్వించదగ్గ విషయమన్నారు. ఈ అవార్డు క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుందన్నారు. ఒక్క నాటు నాటు పాటనే 30 రోజులు రిహార్సల్స్ చేసి.. ఉక్రెయిన్‌లో 17 రోజులు షూట్ చేశామని తెలిపారు. ఆ కష్టానికి ప్రతిఫలంగానే ఆస్కార్ వచ్చిందని అభిప్రాయపడ్డారు.
 
ఆస్కార్ అందుకున్నాక రాజమౌళి, కీరవాణి తదితరులతో మాట్లాడేందుకు ప్రయత్నించానని దానయ్య చెప్పారు. అయితే వాళ్లు ఫంక్షన్‌లో బిజీగా ఉన్నట్లున్నారని, తాను మాట్లాడలేకపోయానని చెప్పారు. ఏది ఏమైనా తెలుగు చిత్రంలోని పాటకు ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.