'ఆర్ఆర్ఆర్' తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీకి అరుదైన రికార్డు
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి సొంతం చేసుకుంది. ఇపుడు ఈ రికార్డులన్నీ బద్ధలైపోతున్నాయి. తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ 'ఆర్ఆర్ఆర్' తర్వాత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ నెల 14వ తేదీన విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విడుదలై వారం రోజులు కావొస్తున్నా కలెక్షన్లు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. పైగా థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వసూళ్ల పరంగా ఈ సినిమా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది.
తాజాగా ఈ మూవీ ఐదో రోజు రూ.12.75 కోట్లు వసూలు చేసింది. దీంతో ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాలలో ఐదో రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు చిత్రాల జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రూ.13.63 కోట్లతో మొదటి స్థానంలో 'ఆర్ఆర్ఆర్' ఉంటే.. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా 'సంక్రాంతికి వస్తున్నాం' (రూ.12.75కోట్లు), 'అల వైకుంఠపురంలో' (రూ.11.43కోట్లు), 'బాహుబలి-2' (రూ. 11.35కోట్లు), 'కల్కి 2898 ఏడీ' (రూ.10.86కోట్లు) ఉన్నాయి.
అటు ఓవర్సీస్ లోనూ వెంకీ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. వెంకటేశ్ కెరీర్‌లోనే అక్కడ ఆల్‌టైమ్ అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన చిత్రంగా 'సంక్రాంతికి వస్తున్నాం' నిలిచింది. తాజాగా అక్కడ ఈ మూవీ రెండు మిలియన్ల మార్క్‌ను దాటినట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది.
కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు. మూవీ ఆల్బమ్‌లోని దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. వెంకీమామ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు.