కిలేడి శిల్పా చౌదరి వెల్లడించిన ఆ ఇద్దరు ఎవరు?
కిట్టీ పార్టీల పేరు, అధిక వడ్డీల పేరుతో అనేక మందిని మోసం చేసిన కిలేడీ శిల్పా చౌదరి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. శుక్రవారం నుంచి శనివారం సాయంత్రం వరకు రెండు రోజుల పాటు ఆమె వద్ద పోలీసులు కోర్టు అనుమతితో విచారణ జరిపారు. ఈ విచారణలో ఆమె ఇద్దరి పేర్లను వెల్లడించినట్టు సమాచారం.
ముఖ్యంగా, వారి ఒకరు శంకరంపల్లికి చెందిన రాధికా రెడ్డి. ఈమెకు రూ.6 కోట్లు ఇచ్చానిని శిల్పాచౌదరి పోలీసులకు తెలిపారు. అలాగే, మరో పేరును వెల్లడించారు. ఆ పేరు ఎవరన్నది బయటకు తెలియకపోయినప్పటికీ, ఆ వ్యక్తిని సోమవారం విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీచేసినట్టు సమాచారం.
ఇదిలావుంటే, శిల్ప వద్ద పోలీసులు విచారణ జరుపుతూనే గండిపేటలోని ఆమె నివాసంలో పోలీసులు సోదాలు కూడా చేశారు. అలాగే, నాలుగు బ్యాంకు ఖాతాలను గుర్తించారు. ఈ ఖాతాల్లో పైసా డబ్బులు లేవని గుర్తించారు. అయితే, రెండు ఖాతాలను స్తంభింపజేశారు.
ఇదిలావుంటే, శిల్పారెడ్డి తన పేరును వెల్లడించినట్టు వార్తలు రావడంతో రాధికారెడ్డి స్పందించారు. తనకు ఎవరూ డబ్బు ఇవ్వలేదని చెప్పారు. మాదాపూర్‌లో ఏసీపీని కలిసిన ఆమె అనవసరంగా తన పేరును ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.