బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (08:59 IST)

మనీలాండరింగ్ కేసు నుంచి బయటపడిన బాలీవుడ్ బ్యూటీ

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, సైబర్ కేటుగాళ్ల చేతిలో చిక్కుకుని అనేక మంది సెలెబ్రిటీలు సైతం మోసపోతున్నారు. తాజాగా మనీలాండరింగ్ కేసులో ఇటీవల ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ముందు విచారణకు హాజరైన శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈ కేసుతో సంబంధం లేదని తేలింది. 
 
అయితే, సుకేష్ చంద్రశేఖర్ అనే మోసగాడికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమెను సాక్షిగా పరిగణించిన ఈడీ విచారణ జరిపింది. తీహార్ జైల్లో ఉన్న సుకేష్.. అక్కడి నుంచి ఇంత పెద్ద రాకెట్ నిర్వహించి, సెలెబ్రిటీలను కూడా మోసం చేయడం చూసిన ఈడీ అధికారులు అవాక్కవుతున్నారు. 
 
జైల్లో ఉన్న సుకేష్ కాలర్ ఐడీ స్పూఫింగ్ ద్వారా జాక్వెలిన్‌ను సంప్రదించినట్లు తెలిసింది. తనను తాను బాగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని జాక్వెలిన్‌తో మాట్లాడేవాడని ఈడీ వెల్లడించింది. జాక్వెలిన్‌తోపాటు మరో ప్రముఖ మహిళా సెలెబ్రిటీని సుకేష్ టార్గెట్ చేసినట్లు అధికారులు చెప్పారు.
 
గతవారమే చెన్నైలో సుకేష్‌కు చెందిన ఒక బంగళాను ఈడీ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ వారికి డజనుకు పైగా ఖరీదైన కార్లు, కొంత డబ్బు కూడా దొరికాయి. ఒక బిజినెస్‌మ్యాన్‌ను మోసం చేసిన సుకేష్.. అతని వద్ద నుంచి ఏడాది కాలంలో రూ.200 కోట్లపైగా దోచుకున్నట్లు కేసు నమోదైంది. అతనిపై 20కిపైగా వేరే దోపిడీ కేసులు కూడా ఉన్నాయి.