శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (16:13 IST)

ఆ అదృష్టం నా జాతకంలో లేదేమో.. వాపోతున్న తాప్సీ

టాలీవుడ్‌లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన తాప్సీ పన్ను ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టి పలు విజయవంతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆమె నటించిన ‘పింక్’, ‘మన్‌మర్జియా’, ‘ముల్క్’ మొదలైన సినిమాలలో కనబర్చిన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇటీవల విడుదలైన సినిమా ‘బద్లా’లో కూడా ఆమె నటనకు ఎన్నో ప్రశంసలను అందుకున్నారు తాప్సీ.
 
ఇంతటి నటనా ప్రతిభ కనబరిచినప్పటికీ గత రెండేళ్లలో ఆమెకు బాలీవుడ్‌లో ఏ కేటగిరీ‌లోనూ ఒక్క అవార్డు కూడా దక్కలేదు. ఇదే విషయాన్ని తాప్సీ దగ్గర ప్రస్తావించగా ‘నాకు ఈ విషయంలో చాలా కోపంగా ఉంది. రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో నేను నటించిన సినిమా ‘పింక్’ వచ్చినప్పుడు నేను ఇండస్ట్రీకి కొత్తదానిని. కాబట్టి అవార్డు తీసుకునే అర్హత నాకు లేదనిపించింది. 
 
కానీ ఆ తర్వాత చాలా సినిమాలలో నటించాను, అందులో రూ.100 కోట్లకు మించిన కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఉన్నప్పటికీ నాకు ఏ అవార్డు దక్కలేదు. ఈ సినిమాల కోసం ఎంతో కష్టపడ్డాను, అయితే అవార్డులను అందుకునే అదృష్టం నా జాతకంలో లేదేమోనని అనిపిస్తుంటుంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాప్సీ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శాండ్ కీ ఆంఖ్’ సినిమాలో నటిస్తోంది.