మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జులై 2020 (11:12 IST)

కరోనా లాక్డౌన్ ఎఫెక్టు : కిరాణా వ్యాపారిగా మారిన తమిళ దర్శకుడు

కరోనా లాక్డౌన్ కారణంగా అనేక మంది జీవితాలు వీధులపాలయ్యాయి. వీరిలో పెదోళ్ల నుంచి సినీ సెలెబ్రిటీల వరకు ఉన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన అనేక మంది పేదలు ఇపుడు తమతమ సొంతూళ్ళకు వెళ్లిపోయారు. అలాగే, ఈ లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు బంద్ కావడంతో అనేక మంది సినీ ప్రముఖులు ప్రత్యామ్నాయ పనులపై దృష్టిసారించారు. ఇందులోభాగంగా, ఓ తమిళ దర్శకుడు ఇపుడు పూటగడవడం కోసం కిరాణా వ్యాపారిగా మారిపోయాడు. ఆ దర్శకుడు పేరు ఆనంద్. గతంలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన ప్రస్తుతం కిరాణా దుకాణం పెట్టుకుని జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు.
 
ముఖ్యంగా, 'ఓరు మళై నాన్గు సారల్', మౌనా మళై’ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ ఇప్పుడు కిరాణా దుకాణం పెట్టుకుని బతుకు బండి లాగిస్తున్నాడు. కరోనా భయం, లాక్డౌన్ కారణంగా చిత్రసీమ తెరుచుకోకపోవడంతో మరో మార్గం లేక చిన్న కిరాణా షాపు పెట్టుకున్నాడు.
 
చెన్నైలోని మౌలివాక్కంలో ఓ స్నేహితుడికి చెందిన గదిని అద్దెకు తీసుకుని అందులో షాపు పెట్టుకున్నాడు. ప్రస్తుతం తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ నిత్యావసరాలకు ప్రభుత్వ అనుమతి ఉండటంతో ఆనంద్ కిరణా షాపు పెట్టుకున్నాడు. కాగా, ఆనంద్ ప్రస్తుతం '‘తునింతు సై' అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం రెండు పాటలు మాత్రమే మిగిలివున్నాయి. 
 
ఆనంద్ సినీ రంగంలోకి ప్రవేశించి పదేళ్లు అయింది. వచ్చే ఏడాది వరకు సినిమా హాళ్లు తెరుచునే అవకాశం లేదని, అందుకనే తాను కిరాణా షాపును ఎంచుకున్నట్టు ఈ సందర్భంగా ఆనంద్ పేర్కొన్నాడు. లాక్డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యానని, అయితే, లాక్డౌన్ సమయంలో కిరణా, ప్రొవిజన్ షాపులకు ప్రభుత్వం అనుమతివ్వడంతో తాను కూడా షాపు తెరవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. 
 
నూనెలు, పప్పులు, బియ్యం సహా నిత్యావసరాలన్నింటినీ విక్రయిస్తున్నట్టు చెప్పాడు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు తక్కువ ధరకే విక్రయిస్తున్నానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని దర్శకుడు ఆనంద్ తెలిపాడు.