1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 25 జులై 2019 (11:45 IST)

ఇంద్రగంటికి పితృవియోగం.. సాహితీవేత్త శ్రీకాంత్ శర్మ ఇకలేరు

టాలీవుడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తండ్రి శ్రీకాంత్ శర్మ ఇకలేరు. ఆయన గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 75 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన శ్రీకాంత్ శర్మ... హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఈయన ప్రముఖ కమి, సాహితీవేత్తగా గుర్తింపు పొందిన విషయం తెల్సిందే. 
 
ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ 1944 మే 29న తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో జన్మించారు. ఈయన 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరి రెండు దశాబ్దాల పాటు సేవలు అందించారు. అనేక లలిత గేయాలు, కవితలు, సాహిత్యవ్యాసాలతోపాటు రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలను రచించారు. 
 
అలాగే, పలు పత్రికల్లో ఉప సంపాదకుడిగా పని చేశారు. పలు తెలుగు సినిమాల్లో పాటలు రాశారు. ‘కృష్ణావతారం’, ‘నెలవంక’, ‘రావుగోపాలరావు’, ‘రెండుజెళ్ల సీత’, ‘పుత్తడిబొమ్మ’, ‘చైతన్యరథం’ వంటి చిత్రాల్లో శ్రీకాంత శర్మ పాటలు రాశారు. తన కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’ సినిమాలోనూ ఆయన పాటను రచించారు. 
 
శ్రీకాంత్ శర్మ 1966లో సుప్రసిద్ధ కథారచయిత్రి జానకీబాలను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. కుమార్తె కిరణ్మయి కూడా డాక్యుమెంటరీ, లఘుచిత్రాలు తీసి అవార్డులు పొందారు. ఈమె మోహనకృష్ణ కంటే పెద్దవారు. కుటుంబం మొత్తం హైదరాబాద్‌లోనే నివాసం ఉంటోంది. 
 
కాగా, శ్రీకాంత్ శర్మ మృతిపై హీరో నాని స్పందించారు. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆయనొక మేధావి అని, గొప్ప వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అష్టా చమ్మా’ సినిమాను చూసిన తరవాత మోహన్ గారితో పాటు తామందరనీ చూసి ఆయన ఎంత గర్వపడ్డారో ఇప్పటికీ మరిచిపోలేనని అన్నారు. మోహనకృష్ణ గారికి, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.