బ్రహ్మ ఆనందం నుంచి సెకండ్ సింగిల్ విలేజ్ సాంగ్
Brahmanandam, gowtam, kishore
మళ్ళి రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హిట్ చిత్రాలతో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకుల్లో తనదైన ముద్రను వేసుకుంది. హ్యాట్రిక్ హిట్ల తరువాత ప్రస్తుతం ఓ సున్నితమైన అంశంతో ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేందుకు బ్రహ్మ ఆనందం అనే చిత్రంతో వస్తోంది. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌కి ఇది నాలుగో ప్రాజెక్ట్. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. బ్రహ్మ ఆనందం టీజర్ అందరినీ నవ్విస్తూనే గుండెకు హత్తుకునే ఎమోషన్స్‌ను చూపించింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌ను పెంచేశారు.
ఇందులో భాగంగా 'విలేజ్ సాంగ్' అనే రెండో పాటను సోమవారం నాడు మేకర్లు రిలీజ్ చేశారు. ఈ పాటను ఎం.ఎం.కీరవాణి విడుదల చేశారు. ఈ పాటకు శాండిల్య పిసాపాటి బాణీ అందరినీ హత్తుకునేలా ఉంది. సురేష్ బనిశెట్టి రాసిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇక ఈ లిరికల్ వీడియోని చూస్తుంటే బ్రహ్మానందం, రాజా గౌతమ్ మధ్య సన్నివేశాల్ని ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. రామ్ మిరియాల గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఆయన గాత్రంలో ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనే కుతుహాలాన్ని పెంచేస్తోంది.
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. శాండిల్య పిసాపాటి సంగీతం సమకూర్చగా, మితేష్ పర్వతనేని కెమెరా మెన్‌గా, ప్రణీత్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు.