మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (08:29 IST)

పొడిదగ్గు - జ్వరం రావడంతో అనుమానం వచ్చింది.. ఇపుడు వంట కూడా నేర్చుకున్నా..

తన భర్తలో కరోనా లక్షణాలు కనిపించాయని వెల్లడించిన సినీ నటి శ్రియ... అసలు తన భర్తకు కరోనా సోకడానికి గల కారణాలను వివరించింది. అంతేకాకుండా కరోనా బారినపడి తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఒకటైన స్పెయిన్‌లో తాము పడుతున్న కష్టాలను కూడా ఆమె ఏకరవు పెట్టింది. ఎంతో త్వరగా, కరోనా వైరస్ ప్రజల జీవితాలను తల్లకిందుకు చేశాయని వ్యాఖ్యానించింది.
 
ఈ సందర్భంగా తన భర్తలో కరోనా ఎలా కనిపించాయన్న అంశంపై ఆమె అభిమానులతో పంచుకుంటూ.. తమ వివాహ తొలి వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని, ముందుగానే ఓ రెస్టారెంట్‌లో రిజర్వేషన్ చేయించుకుని, అక్కడికి వెళ్లామని, అది మూసేసి వుందని చెప్పారు. దీనికి కారణం అప్పటికే స్పెయిన్‌లో లాక్‌డౌన్ అమల్లో ఉందని తెలిపింది. ఆ రోజు నుంచే స్పెయిన్‌లో పరిస్థితులన్నీ మారిపోయాయని చెప్పుకొచ్చింది. ఎవరూ బయట తిరగవద్దని, తప్పనిసరైతేనే రావాలని పోలీసుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపింది. 
 
ఆ తర్వాత ఓ రోజున తన భర్తతో కలిసి బయటకు వెళ్లామని తెలిపింది. తామిద్దరం భార్యాభర్తలమని తెలుసుకుని స్పెయిన్ పోలీసులు వదిలివేశారు. ఆపై కొన్ని రోజులకే తన భర్తకు పొడిదగ్గు, జ్వరం వచ్చాయని, ఆసుపత్రికి వెళితే, ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారనీ, కానీ, ఆసుపత్రిలో చేరితే అక్కడి వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని వారు చెప్పడంతో, ఇంటికే వచ్చేసి, సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నామని, వేర్వేరు గదుల్లో నిద్రించామని చెప్పింది. 
 
ప్రస్తుతం స్పెయిన్‌లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని చెప్పుకొచ్చింది. అదేసమయంలో తాను భారతదేశాన్ని ఎంతో కోల్పోతున్నట్టు చెప్పింది. తన తల్లి వీడియో కాల్‌లో చేసిన సూచనలతో వంట ఎలా వండాలో నేర్చుకున్నానని, ఇప్పుడు సరుకులు కూడా అయిపోతున్నాయని చెప్పింది. కరోనా విజృంభించిన సమయంలో వేలాది మంది పడుతున్న కష్టాలతో పోలిస్తే, తన కష్టం తక్కువేనని వ్యాఖ్యానించింది. ఈ మహమ్మారి ప్రపంచాన్ని వదిలేసిన తర్వాత, మెరుగైన ప్రపంచం మన ముందుంటుందని అభిప్రాయపడింది.