అత్యవసర మందులిచ్చి ఆదుకోండి.. ప్లీజ్ : భారత్‌కు స్పెయిన్ వినతి
కరోనా వైరస్ కోరల నుంచి తమ పౌరులను తమ దేశాన్ని రక్షించాలంటూ భారత్‌ను స్పెయిన్ కోరుకుంది. ఈ క్లిష్టపరిస్థితుల్లో తమకు అత్యవసరమైన వైద్యసదుపాయాలను, సామాగ్రిని సమకూర్చాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు స్పెయిన్ విదేశాంగ మంత్రి అరంచా గొంజాలెజ్ ఫోన్ చేసి ప్రాధేయపడ్డారు. ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఓ ట్వీట్ చేశారు.
"స్పెయిన్ ఫారిన్ మినిస్టర్ అరంచా గొంజాలెజ్‌తో ఫోన్‌లో మాట్లాడా. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల సహకారం అవసరం అని మేమిద్దరం అంగీకరించాం. అలాగే, స్పెయిన్‌కు అత్యవసర ఔషధాలు సరఫరా చేయాలన్న విజ్ఞప్తిపై భారత్ సానుకూలంగా స్పందించింది" అని జైశంకర్ ట్వీట్ చేశారు. స్పెయిన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి దారుణంగా ఉంది. ఆ దేశంలో ఇప్పటికే 1.48 లక్షల మంది వైరస్ బారినపడగా, మరో 14 వేల మంది మృత్యువాతపడ్డారు.