మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మురళి
Last Updated : ఆదివారం, 1 అక్టోబరు 2023 (19:01 IST)

జానపద బ్రహ్మ విఠలాచార్య చరిత్రను అక్షరబద్ధం చేసిన పులగం : దర్శకుడు త్రివిక్రమ్

pulagam chinna narayana
జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాలు చూడని ప్రేక్షకులు ఉండరని అంటే అతిశయోక్తి కాదు. తరాలు మారినా తరగని ఆదరణ కల చిత్రాలు తీశారాయన. విఠలాచార్య సినిమా స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌, ఆయన సినీ ప్రయాణాన్ని ఈతరం ప్రేక్షకులకు సమగ్రంగా పరిచయం చేయాలని సీనియర్‌ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ సంకల్పించి... 'జై విఠలాచార్య' పుస్తకాన్ని తీసుకొచ్చారు. 'మూవీ వాల్యూమ్ మీడియా' ఆధ్వర్యంలో షేక్ జీలాన్ బాషా ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలి ప్రతిని సీనియర్ సివిల్ సర్వెంట్, రైల్వే ఉన్నతాధికారి రవి పాడి అందుకున్నారు.  
 
'జై విఠలాచార్య' పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ''పులగం చిన్నారాయణ నాకు బాగా పరిచయం. ఆయన రాసిన ఇంతకు ముందు పుస్తకాలు కూడా నేను చదివా. ఇప్పుడు విఠలాచార్య గారిపై పుస్తకం రాశారు. విఠలాచార్య అంటే ఫాదర్ ఆఫ్ తెలుగు మాస్ సినిమా, ఫాదర్ ఆఫ్ జానపదాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న వీఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ వంటి వాటికి అన్నిటి కంటే ముందు... తెలుగు సినిమా మొదలైన రోజుల్లో చాలా అడ్వెంచరస్ గా సినిమా తీసిన గొప్ప సాంకేతిక నిపుణుడిగా ఆయనను చూస్తాను. ఆయన సక్సెస్ రేషియో గానీ, ఆయన తాలూకూ రీచ్ గానీ, ఆయన పాపులారిటీ గానీ ఇప్పుడున్న తరానికి, ప్రస్తుతం చాలా మందికి తెలియదు. 
 
యూట్యూబ్ లేదా పాత సినిమాలు ప్రసారం చేసే ఛానళ్లలో చూడటం తప్ప ఆయన గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆయన జీవితం, ప్రస్థానాన్ని జనం ముందుకు తీసుకు రావాలనే ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పులగం చిన్నారాయణ గారికి, రవి గారికి, పబ్లిషర్ జిలానీ గారికి కంగ్రాచ్యులేషన్స్. ఇటువంటి పుస్తకాలు తీసుకు రావడం లాభసాటి వ్యాపారం కాదు. సినిమాపై వాళ్ళకు ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది. పుస్తకాలు అంటే అభిమానించే వ్యక్తిగా ఇటువంటి ప్రయత్నాలు బావుండాలని, ప్రజల్లో పుస్తక పఠనం బాగా పెరగాలని కోరుకుంటున్నా. చరిత్రను రికార్డ్ చేయడం అనేది తెలుగులో తక్కువ. తెలుగు సినిమా చరిత్ర చాలా తక్కువగా అందుబాటులో ఉంది. పులగం చిన్నారాయణ గారు ఇంకా ఇంకా ఎక్కువ పుస్తకాలు రాయాలి. ఆయనకు ఆ శక్తి, ఆసక్తి... రెండూ ఉన్నాయి కాబట్టి పుస్తకాలు ఇలాగే రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 
 
పులగం చిన్నారాయణ మాట్లాడుతూ ''విఠలాచార్య గారు సినిమాలు తీసినంత వేగంగా యి పుస్తకం రాశాను. సూపర్ స్టార్ కృష్ణ గారు, కైకాల సత్యనారాయణ గారు, జమున గారు, వాణీశ్రీ గారు, రాజశ్రీ గారు, జయమాలిని గారు, నరసింహ రాజు గారు ... ఇలా ఎందరో అతిరథ మహారథులతో ఈ పుస్తకం కోసం ఇంటర్వ్యూలు చేశా. అలాగే, విఠలాచార్య గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాను. తెలుగులో విఠలాచార్య గారు దర్శకత్వం వహించిన 39 సినిమాల తెరవెనుక విశేషాలు, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఇప్పటి వరకు ఎక్కడ లేని సమాచారంతో ఈ పుస్తకం రెడీ చేశా. సినిమాలు, సాహిత్యంపై విపరీతమైన అనురక్తి ఉన్న త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు.   
 
సీనియర్ సివిల్ సర్వెంట్, రైల్వే ఉన్నతాధికారి రవి పాడి మాట్లాడుతూ ''సీనియర్ పబ్లిసిటీ డిజైనర్, రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీత ఈశ్వర్ గారి ఆఖరి పెయింటింగ్ తో ఈ పుస్తకం కవర్ పేజీ రూపొందింది. త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా ఈ పుస్తకం తొలి ప్రతిని అందుకోవడం సంతోషంగా ఉంది. పులగం చిన్నారాయణ గారు ఎంతో పరిశోధన చేసి... ఎంతో మందిని కలిసి విఠలాచార్య గారిపై పుస్తకం తీసుకు వచ్చారు. తెలుగు సినిమా చరిత్రను అక్షరబద్ధం చేస్తున్న ఆయన మరిన్ని పుస్తకాలు తీసుకు రావాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు. 
 
షేక్ జీలాన్ బాషా మాట్లాడుతూ ''జర్నలిజంలో ఉన్న నేను ఈ పుస్తకంతో పబ్లిషర్ గా అడుగు పెడుతున్నందుకు గర్వంగా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ పుస్తకం కవర్ పేజీ ఆవిష్కరించారు. అదొక మరపురాని అనుభూతి. ఇప్పుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన త్రివిక్రమ్ గారికి థాంక్స్'' అని చెప్పారు.