సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2023 (15:57 IST)

సోషల్ మీడియా నేపథ్యంతో తెరకెక్కిన ఉపేంద్ర గాడి అడ్డా

Savitri Krishna, srileka, Aryan Subhan
Savitri Krishna, srileka, Aryan Subhan
పూర్తి వినోదం, మాస్ అంశాలతో ఆద్యంతం ప్రేక్షకులను సమ్మోహనపరిచేవిధంగా  "ఉపేంద్ర గాడి అడ్డా" చిత్రం రూపొందిందని నిర్మాత కంచర్ల అచ్యుతరావు స్పష్టం చేశారు. కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ను హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన వేడుకలో ఆవిష్కరించారు.
 
ముఖ్యఅతిధిగా విచ్చేసిన ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ టీజర్ ను విడుదల చేసి, చిత్రం విజయవంతం కావాలని చిత్ర యూనిట్ కు శుభాభినందనలు  అందజేశారు.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ,  "మొదట్నుంచి నాకు సినిమా పిచ్చి ఉండేది. విడుదలైన అన్ని సినిమాలు చూస్తూండేవాడ్ని. అయితే నేను ఇతర వ్యాపార రంగాలలో బిజీ కావడంతో ఇంతకాలం సినిమా రంగంలోనికి ప్రవేశించలేదు. అయితే సినీ హీరో కావాలన్న మా అబ్బాయి ఉపేంద్ర తృష్ణను గమనించి, అతనిని హీరోగా పరిచయం చేస్తూ, ఐదు సినిమాలను మొదలు పెట్టాం. అవన్నీ వివిధ దశలలో ఉన్నాయి. ఐదవ సినిమాగా మొదలు పెట్టిన ఈ సినిమా చాలా వేగంగా పూర్తయి, మొదటి సినిమాగా విడుదలకు సిద్ధమైంది. ఇటీవల చివరి పాటను ఊటీలో చిత్రీకరించడంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ నెల 29న మా అబ్బాయి పుట్టినరోజున ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నాం. అదేరోజున ఈ చిత్రం ట్రైలర్ ను కూడా విడుదల చేస్తాం. నవంబర్ లో ఈ సినిమాను విడుదల చేయడంతో పాటు మిగతా మేము తీస్తున్న సినిమాలను ప్రతీ నెలా ఒక సినిమా చొప్పున విడుదల చేస్తాం" అని చెప్పారు.
 
దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, "థియేటర్ సీట్లో కూర్చున్న ప్రేక్షకుడు నవ్వు ఆపుకోలేక పొట్ట చెక్కలయ్యేవిధంగా  75 శాతం వినోదం ఈ చిత్రంలో ఉంటుంది. అలాగే మాస్ అంశాలు  యువ హృదయాలను అద్భుతంగా అలరింపజేస్తాయి..  సోషల్ మీడియా  నేటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియంది కాదు. దానివల్ల చెడు మార్గాన్ని ఎంచుకోకుండా, మంచిని పెంపొందింపజేస్తే, సమాజం మరింత వికాసవంతం అవుతుందన్న సందేశాత్మక పాయింట్ ను కూడా ఇందులో ఆవిష్కరించాం. నిర్మాత, హీరో ఇచ్చిన సంపూర్ణ స్వేచ్ఛ, సహకారం వల్లే ఈ సినిమాను ఎంతో వేగంగా పూర్తి చేయగలిగాం" అని అన్నారు.
 
హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ, "నా జిజ్ఞాసను గమనించి, మా నాన్న నన్ను హీరోగా పెట్టి ఒక సినిమా కాదు, ఐదు సినిమాలు తీస్తుండటాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు మా అమ్మా, నాన్న పెళ్లిరోజు. అందుకే ప్రత్యేకించి ఈ సినిమా టీజర్ ను వారికి కానుకగా అందించాలని పట్టుబట్టి విడుదల చేయించాను. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది" అని అన్నారు.
 
హీరోయిన్ సావిత్రి కృష్ణ మాట్లాడుతూ, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత తీసిన ఇలాంటి చక్కటి చిత్రంలో నాకు అవకాశం లభించడం ఆనందంగా ఉందని అన్నారు.
 
ఇదే వేడుకలో నిర్మాత కంచర్ల అచ్యుతరావు, ఆయన సతీమణి, చిత్ర సహ నిర్మాత కంచర్ల సుబ్బలక్ష్మి ల పెళ్లిరోజు సందర్భంగా ఆనందోత్సహాల మధ్య భారీ  కేక్ ను కట్ చేశారు.
 
ఈ కార్యక్రమంలో మరో సహ నిర్మాత  కంచర్ల సునీత, సంగీత దర్శకుడు, రాము అద్దంకి, సినిమాటోగ్రాఫర్ రవీందర్ సన్, సంభాషణల రచయిత శ్రీనివాస్ తేజ, రచయిత జాలాది కుమార్తె విజయ తదితరులు పాల్గొన్నారు.