హత్యాయత్నం కేసు : ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు పిటిషన్
మీడియాపై దాడినందుకు సీనియర్ నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. దీంతో ఆయన తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జల్‌పల్లిలోని తన నివాసంలో జర్నలిస్టులపై దాడి ఘటనలో ఆయనపై పహడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసును నమోదు చేసిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో మోహన్ బాబుపై బీఎన్ఎస్ 118 (1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత న్యాయ నిపుణుల నుంచి సలహాను స్వీకరించిన పోలీసులు... గురువారం ఆయనపై 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు తాజాగా దాఖళు చేసిన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
లిఖితపూర్వక క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు
తెలుగు మీడియా టీవీ9కు చెందిన విలేకరిపై దాడి చేసి గాయపరిచిన కేసులో సినీ నటుడు మోహన్ బాబు లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఆ మీడియా సంస్థకు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన టీవీ9 యాజమాన్యానికి ప్రత్యేకంగా ఒక లేఖ రాశారు. తన కుటుంబ ఘటన పెద్దదిగా మారి టీవీ9ను, జర్నలిస్టులను ఆవేదనకు గురిచేసినందుకు చింతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటన అనంతరం 48 గంటల పాటు ఆసుపత్రిపాలు కావడంతో వెంటనే స్పందించలేకపోయానని తెలిపారు. ఆ క్షణంలో గేటు విరగ్గొట్టి 30 మంది లోపలికి ఉరుక్కుంటూ వస్తుంటే సంఘ వ్యతిరేక శక్తులు వస్తున్నారేమో అని తాను ఆందోళనతో ఆ పని చేశానని పేర్కొన్నారు. ఆ రోజు ఆవేశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టు గాయపడటం చాలా బాధించిందన్నారు.
తన వల్ల జరిగిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతున్నానని, టీవీ9 టీంకి, జర్నలిస్ట్ మిత్రుడు రంజిత్ కుటుంబానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. 'మీకు, మీ కుటుంబానికి కలిగిన మనోవేదనకు చింతిస్తున్నా'నని మోహన్ బాబులు తన లేఖలో తెలిపారు.
కాగా, ఈ ఘటనలో ఇప్పటికే మోహన్ బాబుపై 118(1) బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదయిన విషయం తెలిసిందే. అలాగే లీగల్ ఒపీనియన్ తీసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు.. గురువారం ఆయనపై 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు.