ఐదేళ్ళలో నాలుగు మెట్లు ఎక్కిన విజయ్‌దేవర కొండ
విజయ్ దేవరకొండ కెరీర్ ఎవరూ ఊహించని విధంగా సాగుతోంది. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ, వచ్చిన అవకాశంతో హీరోగా మారి యూత్‌లో ముద్దుగా రౌడీ అనిపించుకునేలా చేరాడంటే మామూలు విషయం కాదు. ఆయన హీరోగా నటించిన తొలి సినిమా `పెళ్లిచూపులు`. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందింది. యశ్ గంగినేని, రాజ్ కందుకూరి సినిమాను నిర్మించారు. ఈ సినిమా విడుదలై గురువారంనాటికి అనగా జులై 29కి ఐదేళ్ళ చేరుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా 29 జూలై 2016న విడుదలైన ఈ సినిమాకు సమీక్షల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి స్పందన లభించి, విజయవంతమైంది. ఆ తర్వాత ఒక్కో సినిమాలో నటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కెరీర్‌ను విశ్లేషిస్తూ ఓ డిజైన్ తయారుచేశారు. ఆ లుక్ అందరినీ ఆకర్షిస్తోంది.
విజయ్ దేవరకొండ రవిబాబు దర్శకత్వంలో వచ్చిన `నువ్విలా` సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశాడు. 2012 లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో కూడా చిన్న పాత్ర పోషించాడు. నలుగురిలో ఒకడిగా నటించినా, ఆయన షాట్ వచ్చేసరికి ఏదో ప్రత్యేకత ఆయనలో కనిపించేది. ఆ తర్వాత అంటే మూడేళ్ళకు ఆయన మరో అవకాశం వచ్చింది. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రతో ప్రసిద్ధి చెందారు ఆయన.
ఇక అక్కడనుంచి ఎత్తుపల్లాలలో సాగుతున్న ఆయన హీరో కెరీర్ `అర్జున్ రెడ్డి`సినిమాతో ఒక్కసారిగా ఫేట్ మార్చేసింది. ఆ సినిమా తెలుగు సినిమానేకాకుండా భారత చలనచిత్ర రంగాన్ని ఒక్క కుదుపు కుదిపింది. ఆ సినిమా తమిళం, మలయాళం, హిందీలలోనూ రీమేక్ కావడం విశేషం. టాక్సీవాలా, గీతగోవిందం వంటి సినిమాలు హీరోగా ఆయన్ను ఇప్పటి వర్థమాన హీరోలు అందుకోలేని ఎత్తుకు ఎదిగేలా చేశాయి. తాజాగా ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలీవుడ్ కంపెనీ సహకారంతో రూపొందుతోన్న సినిమా `లైగర్`. ఇలా టాలీవుడ్ నుంచి మాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ వరకు నాలుగు మెట్లు ఎక్కిన ఆయన హీరో ప్రయాణం మరింతగా ముందుకు సాగాలని వెబ్‌దునియా ఆకాంక్షిస్తోంది.