కె.టి.ఆర్. లో అది ప్రస్పుటంగా కనిపిస్తుంది - పవన్ కళ్యాణ్
KTR, pawn kalyan,Taman, Sivamani
కె.టి.ఆర్.గారికి కళల పట్ల ఎంత ఆసక్తి వుందో, సినీరంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ లెటర్ విడుదల చేశారు.
కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి ప్రాంతీయ, భాష, కుల, మత బేధాలు ఉండవు. అంతే కాదు భావ వైరుధ్యాలు అడ్డంకి కాబోవు. ఈ వాస్తవాన్ని మరోమారు తెలియజెప్పిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి నిండు హృదయంతో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ రోజు జరిగే బయో ఆసియా అంతర్జాతీయ సదస్సులో బిల్ గేట్స్ తో కీలకమైన వర్చువల్ మీట్ కు సన్నద్ధమవుతూ బిజీగా ఉన్నా సమయం వెసులుబాటు చేసుకొని భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా తమన్, డ్రమర్ శివమణితో కలిసి డ్రమ్ వాయించడం ఆయనకు కళపట్ల వున్న అభిరుచి తెలియజేస్తోంది.
ఎంత భావ వైరుధ్యాలున్నా.. రాజకీయ విమర్శలు చేసుకున్న వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో ఉంది. ప్రస్తుత హరియాణ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు ప్రతి ఏటా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమంలో అన్ని పక్షాలవారు ఆత్మీయంగా ఉండటాన్ని చూస్తాం. అటువంటి ఆత్మీయత శ్రీ కె.టి.ఆర్. గారిలో ప్రస్పుటంగా కనిపిస్తుంది. సృజనాత్మకత, సాంకేతికతల మేళవింపుతోకొనసాగే సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రంగం అభివృద్ధికి ఆలోచనలను శ్రీ కె.టి.ఆర్. గారు చిత్తశుద్ధితో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.