బుక్ మై షోకు తలొగ్గిన భీమ్లా నాయక్ - కె.టి.ఆర్. రాయితీలు ఇస్తాడా!
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు ఆన్‌లైన్ టికెట్లు లేవనీ, బుక్ మై షోలు వుండదని విడుదలకు ముందు నిర్మాత రాధాకృష్ణ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కానీ మంగళవారం రాత్రికి రూటు మార్చారు. బుక్ మై షోలో సినిమా టికెట్లు బుక్ చేసుకోవచ్చని ప్రకటన చేశాడు. దాంతో పవన్ అబిమానుల్లో హుషారు వచ్చినట్లయింది. ఇలా ఎందుకు చేశారనే దానిపై నిర్మాత వివరణిచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేయలేదు.
ఆలస్యంగా బుకింగ్ పెట్టినా మన టాలీవుడ్లో ఏ సినిమాకి కూడా రాని విధంగా 3 లక్షల 75 వేల మందికి పైగా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరిచారు. దీనితో ప్రస్తుతానికి మన టాలీవుడ్లో ఇది భారీ రికార్డుగా నమోదు అయింది.
కెటి.ఆర్. పవన్ స్నేహితులు
ఇదిలా వుండగా, బుధవారం రాత్రి భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక యూసుఫ్‌గూడలోని జరగబోతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. రెండు రోజులనాడే జరగాల్సి వుండగా ఎ.పి. మంత్రి చనిపోవడంతో ఫంక్షన్ జరుపుకోవడం ఇష్టంలేదని పవన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఫంక్షన్‌కు కె.టి.ఆర్. హాజరు కానున్నారు. అందుకే రెండు రోజులుగా యూసుఫ్‌గూడ పోలీస్ స్టేడియం పోలీసుల కంట్రోల్లో వుంది. అక్కడ కనీసం ఆటలకు సంబంధించిన ప్రోగ్రామ్‌లు కూడా జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పోలీసులు అంతా స్టేడియంను తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు.
అయితే ఈరోజు రాత్రి జరిగే వేడుకలో కె.టి.ఆర్. సినిమా రంగంపై ఆసక్తికరమైన, సబ్సిడీలు ప్రకటించనున్నట్లు ఫిలింనగర్ కథనాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆంధ్ర ప్రభుత్వం షూటింగ్‌ల కోసం ఇక్కడికే రమ్మంటూ, అవసరమైతే స్టూడియోల కోసం స్థలాలు ఇస్తామంటూ హామీ ఇచ్చింది.