పర్వాలేదనిపించే `ఎ1 ఎక్స్ ప్రెస్`
నటీనటులుః సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, రావురమేష్, రఘుబాబు, మురళీ శర్మ, తదితరులు
సాంకేతికః సంగీతంః హిప్‌హాప్ తమజా, దర్శకత్వంః డేనిస్ జీవన్, నిర్మాతలుః విశ్వప్రసాద్, సందీప్ కిషన్, అభిషేక్ అగర్వాల్, దయాపనెం.
సినిమాలనేవి ఆటవిడుపు. కానీ ఏదో చెప్పాలని జనాల్లో స్పోర్టివ్‌నెస్ తీసుకురావడానికి అప్పుడప్పుడు కొన్ని కథలు వస్తుంటాయి. చెక్‌దే, ఒక్కడు వంటి సినిమాలు పదుల సంఖ్యలో వచ్చాయి. అలాంటిది ఇండియన్ నేషనల్ గేమ్‌ను గుర్తించిన హాకీ ఆటను కథాంశంగా తీసుకుని రీమేక్‌గా తీసిన సినిమానే ఎ1 ఎక్స్ ప్రెస్. అంతలా రీమేక్ చేయడం వెనుక సందీప్‌కు 25వ సినిమా కావడం విశేషం. మరి ఆ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథః
యానాంలో 1947 తర్వాత హాకీ ఆడి విజయం సాధించిన తొలితరం చిట్టిబాబు జ్ఞాపకార్థం హాకీ స్టేడియం ఏర్పాటు జరుగుతుంది. అప్పటినుంచి పరంపరంగా కొంతమంది ఆటగాళ్ళు తయారవుతారు. అలాంటి స్టేడియం స్థలంపై మల్టీనేషనల్ కంపెనీ వ్యాపారంకోసం కన్నుపడుతుంది. దాన్ని సాధించాలంటే లోకల్ నాయకుడు, క్రీడాశాఖమంత్రి రావురమేష్ సహాయంతో దక్కించుకోవాలని చూస్తారు. అక్కడ కోచ్ మురళీశర్మ్. హాకీ ఆటంటే ఇష్టంగా ఆడే అమ్మాయి లావణ్య. ఈ క్రమంలో ఇక్కడ సరైన ఆటగాళ్ళు లేరని హైకమిటీకి రాసి స్థలాన్ని కాజేయలాని చూస్తాడు మంత్రి. అన్నీ అనుకున్నట్లు జరిగిపోతుండగా, ఆ సమయంలో అనుకోకుండా సందీప్ కిషన్ వచ్చి గ్రౌండ్ కాపాడేందుకు ఆటడానికి ముందుకు వస్తాడు. అసలు అతను ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అతని ఎందుకు ఈ ఊరికే వచ్చాడు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
ఆట నేపథ్యంలో కథకు మూలం టెంపో. ఆ టెంపో అనేది క్లయిమాక్స్‌లో పుష్కలంగా వుండాలి. ఇందులోనూ వుంది. అది దర్శకుడు చక్కగా ఆవిష్కరించాడు. ఇంటర్‌వెల్ ట్విట్ట్తో అసలు సందీప్ ఎవరనేది రివీల్ అవుతుంది. ఆ తర్వాత ద్వితీయార్థంలో కాస్త నెమ్మదించినా ఆ తర్వాత ఫ్రెండ్ సెంటిమెంట్, లోకల్ సెంటిమెంట్, గ్రౌండ్‌ను స్వార్థపరుడైన మంత్రినుంచి ఏవిధంగా దక్కించుకున్నాడనేది ఆసక్తికరం. ఇలాంటి సినిమాలు పలు వచ్చినా ఆ టెంపో అనేది ఎక్కడా మిస్ కాకుండా దర్శకుడు చక్కగా ఆవిష్కరించాడు. ఇందులో నిజమైన ఆటగాళ్ళను 8మంది చేత ఆడించారు.
చంఢీగర్‌లో పెద్ద స్టేడియంలో ఫైనల్ ఆట జరుగుతుంది. అక్కడ జరిగే ముగింపు సన్నివేశం ఆసక్తికరంగా వుంటుంది. ముఖ్యంగా సందీప్ స్నేహితులు రాహుల్ రామకృష్ణ, సాయి పాత్రలకు సరిపోయారు. రఘుబాబు స్పోర్ట్ డైరెక్టర్‌గా, రావురమేష్ అవినీతి మంత్రిగా సరిపోయారు. ఇక సందీప్ కిషన్ నటన బాగానే వుంది. లావణ్య, పోసాని పాత్రలు కథాపరంగా వున్నాయి.
అయితే ఇందులో కొంత గందరగోళం కనిపిస్తుంది. ఇందులో తన స్నేహితుడు టీషర్ట్ ఎ1 ఎక్స్ ప్రెస్ వేసుకున్నాక సందీప్ ఎక్కడలేని ధైర్యం వస్తుంది. అంతవరకుబాగానే వుంది. అసలు గ్రౌండ్‌లో చెప్పకుండా ఎందుకు తిరిగి వస్తాడో అన్న పాయింట్ అర్థంకాదు. ఇలా కొన్ని మినహా మొత్తంగా సినిమా చూడతగ్గదిగా అనిపిస్తుంది. హాకీ అనేది అందరికీ తెలిసిన ఆట. దాన్ని మరింతగా అందరికీ తెలిసేలా చేయాలనే తపన బాగుంది.
సంగీతపరంగా హిప్‌హిప్ బాణీలు పర్వాలేదనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ సన్నివేశపరంగా బాగానే చేశారు. మిగిలిన విభాగాలు బాగానే వున్నాయి. కథలో సందీప్ ఎందుకు ఊరు వచ్చాడనేది బలంగా లేదు. మాటల పరంగా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలే చక్కగారాసుకున్నారు. ఏ ఆట చూడాలో అనేది కూడా వ్యాపారవేత్తలు డిసైడ్ చేసే స్థితికి రావడం మన దౌర్భాగ్యం. ఇలాంటి సన్నివేశపరంగా బాగున్నాయి. అదేవిధంగా ఇప్పటి రాజకీయనాయకులు, మంత్రులు వారి కిందపనిచేసే ప్రభుత్వ అధికారులు ఎలా ఊడిగం చేస్తారో ఇందులోకళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇలాంటి వర్తమాన కాలానికి సంబంధించిన అంశాలను హాకీ ఆటతో ముడిపడి తీసిన విధానం బాగుంది.
రేటింగ్ః 3/5