నటీనటులుః వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్, సాయిచంద్, హేమ, రవి ప్రకాష్, రచ్చరవి తదితరులు
సాంకేతికతః కథః వెంకట్రామిరెడ్డి, కథనం, దర్శకత్వంః క్రిష్, సంగీతంః కీరవాణి.
కొండలు కోనలు వాగులు వంకలు ఎంత అందంగా వుంటాయో అక్కడ జీవించాలనే వారికి అంత అందంగా వుండదు. క్రూరమృగాలను ఎదుర్కోవటంతోపాటు అక్కడి మానవమృగాలను కూడా ఎదిరించడం అనేవి కథల రూపంలో సినిమాల రూపంలో గతంలో కొద్దిగా వచ్చాయి. మోహన్‌లాల్ నటించిన `మన్నెం పులి`లో ఓ భాగం చూశాం. తెలుగులో తొలిసారిగా అటవీ నేపథ్యంలో తెలుగులో వెంకట్రామిరెడ్డి రాసిన `కొండపులం` నవలను దర్శకుడు క్రిష్ ఆవిష్కరించారు. ఈరోజే విడుదలైన ఆ సినిమా ఎలా వుందోచూద్దాం.
కథః
కాటూరు రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) ఓ గ్రామం. తండ్రి సాయిచంద్ గొర్రెల పెంపకం వృత్తి. వాటిమీద కొడుకును చదివిస్తాడు. చదవు పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం నాలుగేళ్ళు ప్రయత్నించి విఫలమవుతాడు. పైగా ఇక్కడ గొర్రెలు కాయడానికి నీరు వుండదు. కరువుతో అలమటిస్తుంటారు. అందుకే తండ్రితోపాటు మనవడ్ని కొండపొలం అనే ప్రాంతానికి వెళ్ళి గొర్రెలు కాయమని చెబుతాడు. అలా తండ్రితోపాటు మరికొంతమంది ఆ కొండపైకి వస్తారు. అక్కడికి వచ్చాక కొండపొలం అనే అడవిలో వారేమి చూశారు. ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? ఆ అనుభవం రవీంద్ర జీవితానికి ఎలా వుపయోగపడింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
ఇందులో వైష్ణవ్ తేజ్ తన కళ్ళతో ఆకట్టుకున్నాడు. హావభావాలు, అమాయకత్వంతో కూడిన నటన కనబరిచాడు. ఆయనతోపాటు రకుల్ ప్రీత్ సింగ్ కొండప్రాంతాలోని ప్రకృతిని పలుకరించే మాటలు, గొర్రెల భాష, పెంపకం అనే విషయాలు తెలిసినదిగా నటించింది. సాయిచంద్ తండ్రిగా రాణించాడు. నాలుక మందంతో కూడిన మాటలతో నటించిన సీనియర్ నటుడు మెప్పించాడు. రవిప్రకాష్, రచ్చరవి తదితరుల తమ పాత్రలలో అలరించారు.
గొర్రెల కాపరలు కొండప్రాంతానికి వెళ్ళి అక్కడ సాధక బాధలు పడుతూ గొర్రెలను కాపాడుకోవడం మామూలే. కానీ చదువుకొన్న వ్యక్తి గొర్రెలు కాయడం దాని ద్వారా అసలు జీవితం ఏమిటో గ్రహించడం అనేవి ఈ చిత్రంలోని ప్రధాన అంశం. ఈ అనుభవంతోనే అతను ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎలా అయ్యాడనేది మరో అంశం. జీవితంలో ఎదగాలంటే భయమనేది లేకుండా ఎలా బతకాలో అనే అంశాన్ని ఇందులో చూపించాడు. ఎదుటివారి కళ్ళలో చూసి ధైర్యంగా మాట్లాడడం, నీలో నువ్వు వెతుక్కుని ధైర్యంగా వుండడమే జీవితం అనే నీతిని ఇందులో చెప్పాడు దర్శకుడు.
సంభాషణల పరంగా రాయలసీమ గ్రామీణ యాసను నవల ఆధారంగా తెరకెక్కించడంతో ఆ భాషను బాగా అవపోసన పట్టినట్లుగా మాట్లాడిన తీరు బాగుంది. ఇందుకు నటీనటులు బాగానే కసరత్తు చేశారు. సినిమా టోగ్రఫీ కీలకం. అటవీ ప్రాంతంలో రాత్రిపూట, పగలు షూటింగ్ చేయడంలో కెమెరా నైపుణ్యం కనబరిచారు. చంద్రబోస్ సాహిత్యం, కీరవాణి సంగీతం, గాయకుడిగా ఆయన పాడిన పాటలు బాగున్నాయి. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ఎస్సెట్‌గా మారింది.
ముఖ్యంగా పులి గొర్రెలపై దాడిచేయడం, అదీ చూసే తీక్షణమైన చూపును హీరో అదేపనిగా దాన్ని చూడడం వంటి షాట్స్ దర్శకుడు బాగా ఆవిష్కరించాడు. ధైర్యంగా పులిని తీక్షణంగా చూస్తే అది వెనకడుగువేస్తుంది. ఈ పాయింట్‌ను కూడా దర్శకుడు ఆవిష్కరించాడు. పెంపుడు కుక్కకూడా తన యజమానులపై పులిదాడిచేస్తుందని గ్రహించి అది కూడా పోరాడిన విధానం విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది.
ఇక అడవికొండల్లో గొర్రె దొంగలు ఎలా దాడిచేస్తారో, వారిని తాడుతో కట్టిని రాళ్ళతో ఏవిధంగా దాడి చేయవచ్చనే విషయాలను పరిచయం చేశారు. ఇంకోవైపు కొండదేవుడి పేరు చెప్పి గొర్రెలను ఎలా దొంగిలించవచ్చనే విషయాన్ని కొందరిద్వారా చూపాడు. ఫారెస్ట్‌లో పోలీసులు వున్నా ఎవరూ అక్కడకు రారని తెలిసి, ఎర్రచందనం మాఫియా ఎలా చెట్లను కొట్టి వ్యాపారం చేసుకుంటుంది అనేది సూత్రప్రాయంగా చూపించాడు. అలా చెట్లను కొల్లకొట్టి కోట్లు సంపాదించిన అడవీ వారి ఉసురు తీసుకుంటుందనే సూక్తిని కూడా మాటల్లో వెల్లడించాడు దర్శకుడు.
కేవలం కొండ ప్రాంతం, గొర్రెలు, వాటి పెంపకం దారుల జీవితమే అయినా కొండపైకి వెల్ళాక అక్కడ వారు ఎదుర్కొన్న సంఘటనలు స్క్రీన్‌ప్లే బాగా రాసుకున్నాడు దర్శకుడు. అందుకే ఎక్కడా బోర్ అనిపించదు. పులి ఎపిసోడ్‌తోపాటు కొన్నింటికి విఎఫ్ ఎక్స్ సూపర్‌వైజర్ రాజీవ్ చేసిన తీరు బాగుంది. సుద్దాలతోపాటు మరో ఇద్దరు రాసిన సాహిత్యం బాగుంది. `ఓ...ఓ..ఓబులమ్మ.. పాటతోపాటు మిగిలిన రెండు పాటలు కాస్త ఆటవిడుపుగా వున్నాయి.
ఇక ముగింపు అర్థంతరంగా ముగిసినట్లుగా వుంది. కేవలం పులిని తీక్షణం చూసి దాన్ని ఎలా లోబర్చుకున్నాడనే పాయింట్ ఆధారంగానే ఫారెస్ట్ ఆఫీసర్‌గా హీరో సెలక్ట్ కావడంతో షడెన్‌గా ముగింపు ఇచ్చినట్లుంది. ఇక ఈ సినిమా చూశాక. ఫారెస్ట్‌లో ఎర్రచందనం స్మగ్లర్లను ఎలా అరికట్టాడో.. అక్కడ ఎలా డ్యూటీ చేశాడో తెలీదుకానీ.. దానికి సీక్వెల్‌గా.. పుష్ఫ వుంటుందేమోనని కామెంట్లు చూసే ప్రేక్షకుడికి వచ్చాయి.
రొటీన్ లవ్ ప్రేమకథలు కాకుండా సిన్సియర్‌గా చేసిన ప్రయత్నమిది. అటవీ ప్రాంతమైనా అక్కడి మనుషుల్లో ప్రేమ, ఆప్యాయతలు అనేవి ఎలా వుంటాయనేది చూపించిన ప్రయత్నమిది. అక్కడ షూటింగ్ చేయడం చాలా కష్టంతో కూడిన పని. చాలా కాలం తర్వాత వచ్చిన స్వచ్ఛమైన సినిమా. వాణిజ్యపరంగా ఏమేరకు అనేది చెప్పడం కష్టమే కానీ, అవార్డులు మాత్రం ఈ సినిమా దక్కించుకుంటుంది.
రేటింగ్ః 2.75/5