మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (19:03 IST)

మా ఫ్యామిలీకి కూడా నన్ను అలా చూడటం ఇష్టంః వైష్ణవ్ తేజ్

Vaishnav Tej
క్రిష్ గారు `కొండపొలం` క‌థ‌ చెప్పినప్పుడు ఇంకా ఉప్పెన విడుదల కాలేదు. ఆయన తీసిన వేదం, గమ్యం నాకు చాలా ఇష్టం. నన్ను క్రిష్ గారు సంప్రదించడంతో ఎంతో సంతోషంగా ఫీలయ్యాను.  క్రిష్ గారు ఫోన్ చేసినప్పుడు ఊరికే రమ్మంటున్నారేమో అనుకున్నాను. కానీ సినిమా అని చెప్పిన తరువాత `హరిహర వీరమల్లు` తరువాత ఉంటుందేమో అనుకున్నాను. కానీ వెంటనే ప్రారంభిస్తున్నామని ఆశ్చ‌ర్య‌ప‌రిచారని` చిత్ర క‌థానాయ‌కుడు వైష్ణవ్ తేజ్ తెలిపారు.
 
ఉప్పెన చిత్రం తరువాత వైష్ణవ్ తేజ్ న‌టించిన చిత్ర‌మిది. క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె. సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించారు. అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం వైష్ణవ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు.
 
`కొండపొలం`లో అందరూ సీనియర్స్ నటించారు. అందుకే వారు డైలాగ్స్‌ను ఇట్టే చెప్పేసేవారు. నాకు చాలా టెన్షన్‌గా అనిపించేది. కోట గారు ఆ వయసులో వచ్చి నటించడం చాలా గ్రేట్ అనిపించింది. ఆయన వచ్చినప్పుడు మాత్రం అందరం మాస్కులు పెట్టేసుకునేవాళ్లం. సాయి చంద్ గారు ఎప్పుడూ ఎంతో  ఎనర్జీగా ఉండేవారు. అంతే ఎనర్జీగా నటించేవారు. అందరి దగ్గరి నుంచి చాలా నేర్చుకోవ‌డానికి అవ‌కాశం క‌లిగింది` అని 
 
- ఉప్పెనలో ఫిషర్ మ్యాన్ పాత్రను పోషించాను. దానికి తగ్గట్టుగానే నా మేకోవర్ ఉంటుంది. ఇక ఇందులోనూ అంతే రగ్డ్ లుక్‌లోనే కనిపిస్తాను. నా మూడో సినిమాగా కమర్షియల్, లవ్ స్టోరీ చేస్తున్నాను. అందులో నా లుక్ వేరేలా ఉంటుంది.
 
- కరోనా సమయంలో ఇంట్లోనే ఉండ‌డం వ‌ల్ల వెంట‌నే షూటింగ్ చేయడం మరీ అంత కష్టంగా ఏమీ అనిపించలేదు. కొండలు ఎక్కేవాళ్లం, రెండు మూడు కిలోమీటర్లు నడిచేవాళ్లం. అదేం పెద్ద కష్టంగా అనిపించలేదు. కానీ ఆ ఎండల్లో రోజంతా మాస్కులు పెట్టుకుని ఉండటం రెండు మూడు రోజులు  కష్టంగా అనిపించింది. కానీ ఆ తరువాత అలవాటైపోయింది.
 
- ఏమీలేని స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగే ఓ కుర్రాడి కథ. అడవి అంటే ఇష్టం, ఆ అడవి, అక్కడి అమ్మాయితో  ప్రేమలో పడే  కుర్రాడి జీవిత ప్రయాణం, ఆ గ్రాఫ్ బాగుంటుంది. ఈ కథ, పాత్ర చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో పూర్తిగా అక్కడి యాసలో మాట్లాడాను. ఉప్పెనలో  కొన్నిచోట్ల ప్రేక్షకులకు అర్థం కాద‌ని  యాస వాడలేదు. కానీ కొండపొలంలో పూర్తిగా  అక్కడి యాసలోనే మాట్లాడాను.
 
- పెద్ద హీరోల సినిమాలు చూసినప్పుడు నాకు కూడా అలాంటి కథలు చేయాలనిపిస్తుంది. ప్రభాస్ అన్న అలా కొడుతున్నాడు. నాక్కూడా కొట్టాలనిపిస్తుంది. మా ఫ్యామిలీకి కూడా నన్ను అలా చూడటం ఇష్టం. అదే సమయంలో కొత్త కథలు ఎంచుకోవాలనిపిస్తుంది.
 
- గిరి సాయి చిత్రం బాబీ గారి ప్రొడక్షన్‌లో రాబోతోంది. రామ్-కామ్ కాన్సెప్ట్‌. అడ‌విలో ఎక్కువ రోజులు షూటింగ్ చేయ‌డం వ‌ల్ల చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా మనకు అడవి ఎంతో ఆక్సిజన్‌ను ఇస్తుంది. ఎక్కువగా చెత్త వేయకూడదనిపించింది. చిన్న చిన్న పురుగులుంటాయని ఎంతో జాగ్రత్తగా నడిచేవాడిని.
 
- మొదట్లో గొర్రెల భాషను అర్థం చేసుకోలేకపోయాను. తలపొట్టేలు నడిచినట్టుగానే మిగతా గొర్రెలు కూడా నడుస్తాయి. వాటికి పచ్చళ్లు అంటే ఇష్టమని తరువాత తెలిసింది. దాంతో ఆ పికిల్స్‌తో వాటిని కంట్రోల్ చేయ‌డానికి ట్రై చేశాం.
 
- నిర్మాతలు చాలా మంచివారు. రాజీవ్ అన్నను చూస్తే సొంత మనిషిలా అనిపించేవారు. మా బాబాయ్‌ను చూసినట్టు అనిపించేది. ఆయన సెట్‌లో ఎక్కువగా కనిపించరు. కానీ జరగాల్సిన పనులన్నీ కూడా టైంకి జరిగిపోతుంటాయి.
 
- ఎంతో అదృష్టం చేసుకుని ఉంటాను. అందుకే కీరవాణి గారితో  పని చేయగలిగాను. ఆయన కుమారుడు కాళ భైరవ నాకు స్నేహితుడు. కీరవాణి గారిని చూసినా, మాట్లాడినా మా కాళ భైరవ గుర్తుకు వస్తాడు. నా రెండో సినిమాకే ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది.
 
స్క్రిప్ట్‌కు తగ్గట్టు కథ చేశారా? లేదా? అని ఇప్పుడే నేను చెప్పలేను. నాకు ఆ అనుభవం కూడా లేదు. ఇక నా నటన గురించి మీరే చెప్పాలి. నా నటన గురించి నేను జడ్జ్ చేసుకోవడం కంటే దర్శకుడు చెబితేనే బాగుంటుంది. కొన్ని సార్లు మనం బాగా చేశామని మన మనసు చెబుతుంది. అలాంటప్పుడు మానిటర్ చూస్తాను.
 
అన్న‌య్య‌కు ఫిజియోథెరపీ జరుగుతోంది
- రిపబ్లిక్ చిత్రంలో అన్నయ్య ఐఏఎస్, నేను ఇందులో ఐఎఫ్ఎస్. కానీ రిపబ్లిక్, కొండపొలం సినిమాకు సంబంధం ఉండదు.  అన్నయ్య (సాయి ధరమ్ తేజ్) బాగున్నారు. త్వరగా కోలుకుంటున్నారు. ఇప్పుడు ఫిజియోథెరపీ జరుగుతోంది. తొందర్లనే బయటకు వస్తారు.
 
- మా మామయ్యలు, అన్నయ్యకు ఇమేజ్ రావడం నేను చూశాను. కానీ నాకు ఇలా వస్తుందని, ఇలా వస్తే ఎలా ఉండాలో కూడా ఆలోచించలేదు. ఎక్క‌డికైనా బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు అంద‌రూ న‌న్ను చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది.
 
- ఓటీటీ ఆఫర్లు ఇప్పటికి రాలేదు. వస్తే తప్పకుండా న‌టిస్తాను. ప్రస్తుతానికి అయితే గిరి సాయి (తమిళ అర్జున్ రెడ్డి దర్శకుడు) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాను.