సోమవారం, 18 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 14 జనవరి 2022 (15:52 IST)

కల్యాణ్ దేవ్ ద్వితీయ చిత్రం సూప‌ర్ మ‌చ్చి ఎలా వుందంటే..

Kalyan Dev, Rachita Ram
నటీనటులు: కల్యాణ్ దేవ్, రచిత రామ్, వీకే నరేష్, పోసాని కృష్ణ మురళి, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి, మహేష్ ఆచంట తదితరులు
సాంకేతిక‌వ‌ర్గంః సినిమాటోగ్రఫి: శ్యామ్ కే నాయుడు, మ్యూజిక్: ఎస్ థమన్, ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్, నిర్మాత: రిజ్వాన్, రచన, దర్శకత్వం: పులి వాసు.
 
సంక్రాంతిలో హ‌డావుడి లేకుండా విడుద‌లైన సినిమా `సూపర్ మచ్చి`. విజేత ఫేమ్ కల్యాణ్ దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రమిది. ప‌రిమిత బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా శుక్ర‌వార‌మే విడుద‌లైంది. ఎలా వుందో చూద్దాం.
 
క‌థ‌గా చెప్పాలంటే, 
చ‌దువు పెద్ద‌గా లేని బాద‌ర‌బందీ లేని కుర్రాడు  రాజు (కల్యాణ్ దేవ్). అత‌న్ని ఇన్ఫోసిస్‌ కంపెనీలో ప‌నిచేసే మీనాక్షి (రచిత రామ్) ప్రేమిస్తుంది. కానీ అత‌ను ప‌ట్టించుకోడు. ఓరోజు విసుగుపుట్టి ఓ రాత్రి త‌న‌తో గ‌డిపితే పెళ్లి చేసుకుంటానని లిటికేష‌న్ పెడ‌తాడు. ఆ త‌ర్వాత త‌నేమి చేసింది. అస‌లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే మీనాక్షి ఆవారాగా తిరిగే రాజును ఎందుకు ప్రేమిస్తుంది? మ‌రోవైపు ఆమె తండ్రి కోరిక మేర‌కు త‌నేమి చేసింది? ఆ త‌ర్వాత క‌థ ఎటువంటి మ‌లుపు తిరిగింది? అనేది మిగిలిన క‌థ‌. 
 
విశ్లేష‌ణః
క‌థ‌లోని పాయింట్ రొటీన్‌గానే అనిపిస్తుంది. ఆడాళ్ళంతా వెథ‌వ‌ల్నే ప్రేమిస్తార‌నే నానుడి త‌ర‌హాలో క‌థ వున్నా.  దానివెనుక కార‌ణం ఏమిట‌నేది సినిమాలో మ‌లుపు తిప్పే అంశం. ఈ క‌థలో కొన్ని భావోద్వేగాలు పండాయి.. రాజు తల్లిదండ్రులు (ప్రగతి, వీకే నరేష్) మధ్య ఎమోషనల్ సన్నివేశాలు కథకు ఫీల్‌గుడ్‌గా మారుతుంది. బార్‌లో పాటలు పాడే రాజుతో మీనాక్షి వన్ సైడ్ లవ్‌ ప్రధమార్థంలో ప్రధానమైన కథగా సాగుతుంది ఓ ఎమోషనల్ ఎపిసోడ్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది.
 
ద్వితీయార్థంలో తనకు తెలియని అజ్ఞాత ప్రేమికురాలిని రాజు ప్రేమించడం కథలో సరికొత్త పాయింట్. సినిమా రెండో భాగంలో మీనాక్షి, తండ్రి మధ్య వచ్చే సన్నివేశాలు కథను ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌ను క్రియేట్ చేస్తాయి. మరణానికి ముందు తండ్రి కోరిన కోరిక కోసం ప్రాణంగా ప్రేమించే యువకుడిని ప్రేమను త్యాగం చేసి రాజు కోసం సర్వం అర్పించడానికి సిద్దమైందనే పాయింట్ ఫీల్‌గుడ్‌గా మారుతుంది. క్లైమాక్స్‌లో కథకు ఇచ్చిన ముగింపు ప్రేక్షకుడికి సంతృప్తిని కలిగిస్తుంది.
 
దర్శకుడు పులి వాసు పూర్తిస్థాయి ఎమోషనల్ లవ్ జర్నీగా మలచడంలో  తడబాటు కనిపిస్తుంది. సెకండాఫ్‌లో తండ్రి (రాజేంద్రప్రసాద్), కూతుళ్ల (రచిత రామ్) మధ్య ఎపిసోడ్స్‌ను మరింత బాగా మలిచి ఉంటే మరో సుస్వాగతం లాంటి సినిమాగా మారి ఉండేదనిపిస్తుంది. హీరో మొద‌టి చిరంజీవి విజేత పేరుతో విడుద‌ల‌చేశారు. ఈ సినిమా ప‌వ‌న్ క‌ళ్యాన్ సినిమా త‌రహాలో ద‌ర్శ‌క‌డు తీయాల‌నుకున్నాడు. దాంతో రొటీన్ సన్నివేశాలు, నాసిరకమైన సీన్లు సినిమాలోని ఎమోషనల్ పాయింట్‌ను తేలిక చేశాయి. మొత్తంగా ప‌తాక స‌న్నివేశంలో దర్శకుడు చూపించిన ప్రతిభ ప్రేక్షకుల మెప్పు పొందేలా ఉంటుంది.
 
 న‌టుడిగా కల్యాణ్ దేవ్ బాధ్యతలేని యువకుడిగా, చూడని ప్రియురాలి కోసం తపన పడే ప్రేమికుడిగా  బాగా నటించాడు. అయితే మ‌రింత‌గా అత‌నిలో ప్ర‌తిభ‌ను రాబ‌ట్టుకునే అవ‌కాశం లేక‌పోలేదు.  రాజు పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారనే విషయం చాటా చోట్ల కనిపిస్తుంది. రెండో సినిమాలోనే రకరకాల ఎమోషన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. ఫైట్స్, డ్యాన్సులు బాగా చేశాడు. నీవు అతడిని పెళ్లి చేసుకొంటే సీతవు అవుతావో తెలియదు కానీ.. నిన్ను పెళ్లి చేసుకొంటే అతడు రాముడు అవుతాడు అంటూ మీనాక్షికి ఆమె తండ్రి చెప్పిన డైలాగ్ కథలోని ఎమోషన్స్, లవ్‌ను చెప్పేస్తాయి. సంభాష‌ణ‌ల ప‌రంగా ర‌చ‌యిత తీసుకున్న జాగ్ర‌త్త ఈ డైలాగ్‌లో క‌నిపిస్తుంది.
 
క‌థానాయిక‌గా మీనాక్షి పాత్రలో రచిత రామ్ ఆకట్టుకొన్నది. అందం, అభినయంతో మెప్పించే ప్రయత్నం చేసింది. మిగిలిన న‌టీన‌టులు త‌మ పాత్ర‌ల‌కు స‌రిపోయారు. 
 
టెక్నిక‌ల్‌గా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు అంతగా ఆద‌ర‌ణ‌పొంద‌లేదు. మార్తాండ్ వెంకటేష్ కత్తెర పదును సెకాండఫ్‌లో కాస్త తగ్గిందనే చెప్పాలి. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫి బాగుంది. బ్రహ్మ కడలి ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. కథ, కథనాల్లో కొన్ని లోపాలను సరిదిద్దుకొంటే మంచి ప్రేమ కథ అయి ఉండేది. ఓవరాల్‌గా పండుగ సమయంలో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించే ప్రయత్నం చేసిన నిర్మాత రిజ్వాన్ ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. 
రేటింగ్‌- 2.5/5