మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : గురువారం, 12 ఏప్రియల్ 2018 (21:32 IST)

మ‌న‌సులు గెలిచే కృష్ణార్జునులు .. నాని "కృష్ణార్జునయుద్ధం" మూవీ రివ్యూ (Video)

సాధారణంగా హీరోలకు ఒక్క సినిమా హిట్ పడిందంటే వారి ఆనందానికి అవధులుండవు. అలాంటిది నేచురల్ స్టార్ నానికి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది హిట్లు ఉన్నాయి. అవీకూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్.

స‌మ‌ర్ప‌ణ‌: వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి
నిర్మాణ సంస్థ‌: షైన్ స్క్రీన్స్‌
న‌టీన‌టులు: నాని, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్, బ్ర‌హ్మాజీ, దేవ‌ద‌ర్శిని, నాగినీడు త‌దిత‌రులు
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మేర్ల‌పాక గాంధీ
 
సాధారణంగా హీరోలకు ఒక్క సినిమా హిట్ పడిందంటే వారి ఆనందానికి అవధులుండవు. అలాంటిది నేచురల్ స్టార్ నానికి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది హిట్లు ఉన్నాయి. అవీకూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్. ప్రస్తుతం ఈ తరహా హిట్స్ మరో హీరోకులేవు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో మొదలైన నాని జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. వైవిధ్యమైన స్టోరీలతో ప్రజెంట్ టాలీవుడ్‌లో మరే హీరోకులేని సక్సెస్ రేటును కంటీన్యూ చేస్తున్నాడు. 
ఇప్పటివరకు ఎనిమిది విజయాలను ఖాతాలో వేసుకున్న నాని, తొమ్మిదో హిట్‌కు రెడీ అయ్యాడు. "కృష్ణార్జునయుద్ధం" సినిమాతో రణరంగలోకి దిగాడు. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభిన‌యం చేయ‌డం. కృష్ణ‌, అర్జున్ అనే రెండు విభిన్న‌మైన పాత్ర‌ల‌తో నాని చేయ‌బోయే యుద్ధం ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తిని ముందు నుండి అంద‌రిలో క్రియేట్ అయ్యింది. ఇప్ప‌టికే 'జెండాపై క‌పిరాజు', 'జెంటిల్‌మ‌న్' చిత్రాల్లో నాని ద్విపాత్రాభిన‌యం చేశాడు. అందులో 'జెండాపై క‌పిరాజు' ప్లాప్ అయితే 'జెంటిల్‌మ‌న్' హిట్ అయ్యింది. మ‌రి మూడోసారి నాని ద్విపాత్రాభిన‌యం చేసిన "కృష్ణార్జున‌యుద్ధం" చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ చిత్ర కథ ఎలా ఉందో ఓసారి పరిశీలిద్ధాం.
 
కథ : 
కృష్ణ (నాని) చిత్తూరు జిల్లా అక్కుర్తి గ్రామానికి చెందిన ఓ యువ‌కుడు. ప‌క్షులు పొలాల్లోని పంట‌ను నాశ‌నం చేయ‌కుండా కాపలా కాస్తుంటాడు. ఇతనికి నాట‌కాలంటే మహాపిచ్చి. అదేసమయంలో గ్రామంలోని అమ్మాయిలకు లైన్ వేస్తుంటాడు. ఈ క్రమంలో వారినుంచి తిట్లు తింటుంటాడు. ఓ సంద‌ర్భంలో గ్రామ స‌ర్పంచ్‌(నాగినీడు) త‌న త‌ల్లిని తిట్టాడ‌ని.. కృష్ణ కాల‌ర్ ప‌ట్టుకుంటాడు. మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పే మ‌న‌స్త‌త్వం ఉన్న కృష్ణకు స‌ర్పంచ్ మ‌న‌వ‌రాలు రియా(రుక్స‌ర్ మీర్‌)ను చూసి వెంటనే మనసు పారేసుకుంటాడు. ఆ తర్వాత కృష్ణలోని మంచితనం గ్రహించిన రియా కూడా అతని ప్రేమలో పడుతుంది. ఈ విషయం గ్రామ సర్పంచ్‌కు తెలుస్తుంది. కృష్ణ పేదింటి పిల్లోడు కావడంతో అతనికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టపడని సర్పంచ్ తన మనుమరాలిని హైద‌రాబాద్ పంపిస్తాడు. 
 
ఈ క‌థ‌కు స‌మాంత‌రంగా ప్రాగ్‌(యూర‌ప్‌)లో మరో కథ సాగుతుంది. ఇందులో హీరో అర్జున్(నాని). ఇతనో పెద్ద రాక్‌స్టార్‌. అర్జున్‌కి అమ్మాయిల‌ను ముగ్గులోకి దించే ప్లేబోయ్ మ‌న‌స్తత్వం ఉంటుంది. ఓ సందర్భంలో సుబ్బ‌ల‌క్ష్మి(అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌)ను చూసి ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే సుబ్బ‌ల‌క్ష్మి మాత్రం అర్జున్ ప్రేమ‌ను అంగీక‌రించ‌దు. అదేసమయంలో ఆమె హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరుతుంది. ఒక ప‌క్క రియా.. మ‌రో ప‌క్క సుబ్బ‌ల‌క్ష్మిని ఎవ‌రో కిడ్నాప్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ‌, అర్జున్‌లు హైద‌రాబాద్‌కు చేరుకుంటారు. ఇంత‌కు కృష్ణ‌, అర్జున్‌లు క‌లుస్తారా? సుబ్బ‌ల‌క్ష్మి, రియాలు ఎమ‌వుతారు? చివ‌ర‌కి క‌థ ఎన్ని మ‌లుపులు తిరుగుతుంది? అనేదే పూర్తి కథ. 
 
విశ్లేషణ : 
కథ చాలా సింపుల్‌గా ఉంది. మొదటి భాగం పూర్తి కామెడీ ట్రాక్‌తో సాగుతుంది. ద్వితీయార్థంలో అస‌లు క‌థ ఉంటుంది. ఆరంభ స‌న్నివేశాలు సాదాసీదాగా అనిపించినా, క‌థ ముందుకు న‌డుస్తున్న కొద్దీ, కృష్ణ పాత్ర, అత‌ని అల్ల‌రి, అత‌ను ప‌లికే చిత్తూరు యాస న‌వ్వులు పూయిస్తుంది. మ‌రోప‌క్క రాక్‌స్టార్ అర్జున్ ప్లేబాయ్‌గా సంద‌డి చేస్తుంటాడు. ఆ పాత్ర‌లో నాని పెద్ద‌గా ఆక‌ట్టుకోడు. 
 
అయితే, పూర్తి కామెడీతో సినిమా సాగుతున్న సమయంలో క‌థ ఓ మ‌లుపు తిరుగుతుంది. ఇద్ద‌రు హీరోయిన్‌లు, హీరోలు ఒకే విధ‌మైన స‌మ‌స్య‌లో చిక్కుకుంటారు. దీంతో క‌థ హైద‌రాబాద్‌కు చేరుకుని, త‌ర్వాత ఏంట‌నే ఆస‌క్తి రేకెత్తిస్తుంది. అయితే ఆ ఆస‌క్తికి త‌గ్గ‌టుగా ద్వితీయార్థంలో బ‌లం లేక‌పోవ‌డం సినిమాకు కాస్త ప్ర‌తికూలం. తాము ప్రేమించిన అమ్మాయిల‌ను హీరోలు ర‌క్షించ‌డ‌మే అస‌లు క‌థ‌. ప్ర‌థ‌మార్థంతో పోలిస్తే వినోదం పాళ్లు త‌గ్గ‌డంతో పాటు, క‌థ‌లోనూ పెద్ద‌గా విష‌యం లేక‌పోవ‌డంతో సినిమా కాస్త సాగ‌దీత‌గా అనిపిస్తుంది. ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు కృష్ణ పాత్ర‌లో నాని త‌న‌దైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించ‌డం సినిమాకు క‌లిసొచ్చే విష‌యం.
 
పాత్రల తీరుతెన్నులు : 
ఈ చిత్రంలో నాని ద్విపాత్రిభినయంలో చక్కగా ఒదిగిపోయాడు. అయితే, అర్జున్ కంటే కృష్ణ‌గానే ఎక్కువ‌గా న‌చ్చుతాడు. ఊళ్లో త‌న స్నేహితుల‌తో క‌లిసి పండించిన వినోదం ఆద్యంతం న‌వ్వులు పంచుతుంది. క‌థానాయిక‌లు ఇద్ద‌రూ అందంగా క‌నిపించారు. ప‌రిధి మేర‌కు న‌టించారు. ప్ర‌థ‌మార్ధంలో బ్ర‌హ్మాజీ, నాని స్నేహితులుగా క‌నిపించిన న‌టులు, సుబ్బ‌ల‌క్ష్మి పిన్నిగా న‌టించిన దేవ‌ద‌ర్శిని, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు న‌వ్వులు పంచారు. ఇకపోతే, ఈ చిత్రం సాంకేతిక విలువలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కెమెరా పనితనం బాగుంది. యూర‌ప్‌తో పాటు, చిత్తూరు జిల్లా ప‌ల్లెటూరి అందాల‌ను చాలా అందంగా చూపించారు. హిప్‌హాప్ త‌మిళ స్వ‌ర‌ప‌రిచిన మూడు పాట‌లు బాగున్నాయి. క‌థానాయకుల పాత్ర‌ల‌ను స‌మాంత‌రంగా న‌డిపించిన విధానం, కామెడీ విష‌యంలో ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం క‌నిపిస్తుంది. ద్వితీయార్థంలో కథను మరింత బలంగా చూపించివుంటే సినిమా మరింతగా ఆకట్టుకునేది. మొత్తంమీద హీరో నాని ఖాతాలో మరో హిట్ పడినట్టే. వీడియో చూడండి.