గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (15:28 IST)

కన్నడ చిన్నదానికి 'ఉప్పెన'లా అవకాశాలు

తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ కృతిశెట్టి. మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెనలో హీరోయిన్‌గా నటించింది. తన తొలి చిత్రంతోనే ఈ కన్నడ చిన్నది కుర్రకారుని వలపు ఉప్పెనలో ముంచెత్తుతోంది. చూడగానే మంత్రముగ్ధుల్ని చేసే రూపలావణ్యం, నాజూకు అందాలు కలబోసిన చక్కటి అభినయంతో ఈ తుళు సుందరి యువతరం కలలరాణిగా మారింది. 

‘ఉప్పెన’తో నాయికగా అరంగ్రేటం చేసిన కృతిశెట్టికి ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. నాని సరసన ‘శ్యామ్‌సింగరాయ్‌' చిత్రంలో ఓ నాయికగా నటిస్తున్న ఈ భామ.. సుధీర్‌బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో కూడా కథానాయికగా ఖరారైంది. 

తాజాగా ఈ సుకుమారి తెలుగులో మరో బంపరాఫర్‌ను సొంతం చేసుకుంది. రామ్‌ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రం తాజాగా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇందులో కృతిశెట్టిని కథానాయికగా ఎంపిక చేశారు. కేవలం ఒకే ఒక్క సినిమాతో వరుసగా మూడు భారీ చిత్రాల అవకాశాల్ని సొంతం చేసుకొని కృతిశెట్టి అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.