బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (08:05 IST)

మసాలా సీన్లతో మేడ్ ఇన్ టాలీవుడ్ మూవీ 'మ్యాడ్' అనుకుంటారు కానీ, రివ్యూ చూడండి...

Mad team
న‌టీన‌టులుః మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ, ఇందు త‌దిత‌రులు
 
సాంకేతిక‌తః కెమెరా : రఘు మందాటి, ఎడిట‌ర్‌ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం :
మోహిత్ రెహ్మానియాక్, లిరిక్స్‌ : ప్రియాంక, శ్రీరామ్, నిర్మాత‌లు : టి. వేణుగోపాల్ రెడ్డి, బి.
కృష్ణా రెడ్డి & మిత్రులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్, ద‌ర్శ‌క‌త్వం-లక్ష్మణ్ మేనేని.
విడుద‌లః ఆగ‌స్టు 6 శుక్ర‌వారం
 
నేటి సినిమాలు యూత్ తీస్తున్నారు. ఇప్ప‌టి ట్రెండ్ వివాహం జీవితంలో ఎలా వుంటున్నారో వారి ఆలోచ‌న‌లు ఎటువైపు ప‌రుగెడుతున్నాయ‌నేవిధంగా సినిమాలు వుంటున్నాయి. అంతా కొత్త‌వారితో తీసిన మ్యాడ్ సినిమా సారాంశం అదే. వివాహం, విడాకుల కథాంశాలతో ప‌లు క‌థ‌లు వ‌చ్చాయి. ఇక్కడ ‘మ్యాడ్’ అంటే పిచ్చి మాత్రమే కాదు ఈ -ఎం.ఎ.డి. కి అబ్రివేషన్ ‘మ్యారేజ్ అండ్ డైవోర్స్’ అని ద‌ర్శ‌కుడు లక్ష్మణ్‌ మేనేని క్లారిటీ ఇచ్చాడు.
 
క‌థః
 
మాధవ్ (మాధవ్ చిలుకూరి), అరవింద్ (రజత్ రాఘవ్) స్నేహితులు. మాధవ్ ది బాధ్య‌త‌లు లేకుండా క‌నిపించిన అమ్మాయితో తిరుగుతుంటాడు. వ్యాపార‌వేత్త కొడుకు. ఇందుకు రివ‌ర్స్ భావాలు క‌లిగిన అమ్మాయి మాధురి (స్పందన పల్లి). పెద్ద‌లు వివాహం చేస్తారు ఇద్ద‌రికీ. ఇక అర‌వింంద్ భావాలు న‌చ్చి అఖిల (శ్వేతవర్మ) స‌హ‌జీవ‌నం చేస్తుంది. కొంత‌కాలానికి మాధ‌వ్ విడాకుల కోసం కోర్టును ఆశ్ర‌యిస్తాడు. ఇంకోవైపు అర‌వింద్ తీరు న‌చ్చ‌క అఖిల అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ రెండు జంటలు తిరిగి ఒక‌ట‌య్యారా? లేదా? అనేది మిగతా కథ.
 
 
విశ్లేష‌ణః 
చిన్న పాయింట్ ఇది. దీన్ని ఎలా ప్ర‌జెంట్ చేశాడ‌నేది ఆస‌క్తిక‌రం. అయితే ట్రైల‌ర్‌లో వున్న‌ట్లు మొద‌టిభాగ‌మంతా చాలామ‌టుకు చుంబనాలు, హ‌గ్గింగ్‌లు బాగానే వున్నాయి. పైగా మ్యాడ్ అనే టైటిల్ కూడా కాస్త కన్‌ఫ్యూజ్‌గా వుండ‌డంతో ఇదేదో వేరే సినిమా అని అనుకుంటారు. అస‌లు మ్యాడ్ అంటే ఇది అంటూ వివ‌రంగా ఒక్కో అక్ష‌రం గురించి చెప్ప‌బ‌డం సింబాలిక్‌గా వుంది. క‌థ‌, క‌థ‌నం బాగా వుంటే థియేట‌ర్ల‌కు జ‌నాలు వ‌స్తార‌ని తెలిసిందే. ద‌ర్శ‌కుడు కాస్త ఆ దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తే బాగుండేది. అడ‌ల్ట్ కంటెంట్ మొద‌టి భాగం వుండేస‌రికి సెకండాఫ్‌లో ఎలా ఆ జంట‌లు క‌లుస్తాయ‌నేది శ్ర‌ద్ధ పెట్టాడు. 
 
ఎంచుకున్న కథ బాగుంది. చిన్నపాటి అపోహల కారణంగా పెద్ద‌లు కుదిర్చిన వివాహం, స‌హ‌జీవ‌నం అనేవి కూడా ఎలా బెడిసి కొట్టాయ‌నేవి చూపించారు. కాస్తంత ఓర్పుతో, సహనంతో ప్రవర్తిస్తే, జీవితాలు ఆనందమయం అవుతాయని చెప్పే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల అవసరానికి మించిన ఎక్స్‌పోజింగ్ సీన్స్ తో సాగిపోయింది. ద్వితీయార్ధంలో కథ గాడిన పడుతుంది. రెండు జంటలు తమ సమస్యలకు పరిష్కారం వెదుక్కోవడంతో కథ సుఖాంతమౌతుంది. కానీ వీరు విడిపోవడానికి, తర్వాత తిరిగి కలవడానికి బలమైన సన్నివేశాలను దర్శకుడు చూపించ‌గ‌లిగితే బాగుండేది.
 
పాత్ర‌ల‌ప‌రంగా మాధవ్, మాధురి జంట చూడ‌ముచ్చ‌ట‌గా వుంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన ‘శ్రీవల్లి’ మూవీ ఫేమ్ రజిత్ రాఘవ్ ఇందులో అరవింద్ పాత్రను పోషించాడు. అక్కడక్కడా బాగానే చేశాడు. ఈ ముగ్గురిలో కాస్తంత అనుభవం ఉన్న నటి శ్వేత వర్మ. ఇప్పటికే పలు చిత్రాలలోనూ, వెబ్ సీరిస్ లోనూ నటించింది. ఆమె శృంగార సన్నివేశాలలో పాత్ర పరిధిని దాటి అభినయించిందని చెప్పాలి. మిగిలిన‌వారు కొత్త‌వారే.
 
సాంకేతిక నిపుణులు. మోహిత్ రెహ్మానియన్ సంగీతం ఫీల‌యిచేసిన‌ట్లుంది. పాటల బాణీలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ముఖ్యంగా ప్రముఖ గాయనీ గాయకులతో వాటిని పాడించడంతో వినసొంపుగా ఉన్నాయి. ఇక ద్వితీయార్థంలో వచ్చే సూఫీ గీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. లక్ష్మీ ప్రియాంక రాసిన గీతాలు భావయుక్తంగా ఉన్నాయి. రఘు మందాటి సినిమాటోగ్రఫీ బాగుంది. సీనియర్ ఎడిటర్ మార్తండ్ కె. వెంకటేశ్ ఈ మూవీకి పని చేయడం ప్లస్ పాయింట్.

తొలిసారి చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టిన వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి ఎంచుకున్న కథ, కథనాలే ఈ సినిమాను ఓ వర్గానికే పరిమితం చేసేలా వున్నాయి. మేకింగ్ విలువ‌లు, సంగీతం, కెమెరాపనితనం బాగుంది. క‌థ‌నం ఇంకాస్త ఆక‌ట్టుకునేలా వుంటే బాగుంది. మ‌సాలా స‌న్నివేశాలు త‌గ్గించాల్సింది. ఏదిఏమైనా యువ‌త ఆలోచ‌న‌ల‌కు అద్దంప‌ట్టే సినిమా ఇది. ఓటీటీలో శ్రుతిమించిన క‌థ‌లు వ‌స్తున్నాయి. థియేట‌ర్ క‌నుక పెద్ద‌లు చూసేవిధంగా క‌థ‌పై మ‌రింత శ్ర‌ద్ద‌పెడితే బాగుండేది.
రేటింగ్ః 2.75/5