శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 మార్చి 2022 (10:13 IST)

RRR movie review: జక్కన్న మాస్టర్ పీస్ ఆర్ఆర్ఆర్.. చెక్కేశాడుగా!

నటీనటులు: ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్, ఒలివియా మోరిస్, సముద్రకని, అలిసన్ డూడీ, రే స్టీవెన్ సన్, శ్రియా శరణ్, రాజీవ్ కనకాల, ఛత్రపతి శేఖర్, రాహుల్ రామకృష్ణ, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్ 
నిర్మాత: డి.వి.వి. దానయ్య
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
సినిమాటోగ్రఫి: కె.కె.సెంథిల్ కుమార్
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
యాక్షన్: నిక్ పావెల్
 
జక్కన్న, ఎన్టీఆర్, చెర్రీ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూసిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైంది.  బాహుబలి- ద కంక్లూజన్ తరువాత దాదాపు ఐదేళ్ళకు వచ్చిన రాజమౌళి చిత్రమిది. అరవింద సమేత విడుదలైన నాలుగేళ్ళకు విడుదలైన జూనియర్ యన్టీఆర్ చిత్రమూ ఇదే.
 
వినయ విధేయ రామ జనం ముందు నిలచిన మూడేళ్ళకు వెలుగు చూసిన రామ్ చరణ్ చిత్రం కూడా ఇదే. అందువల్ల ట్రిపుల్ ఆర్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 
 
తెలుగునాట జూ.యన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరికీ ఉన్న మాస్ ఇమేజ్ గురించి కొత్తగా చెప్పవలసిన పనిలేదు. వారిద్దరూ కలసి నటించడం అన్నది సినీఅభిమానులకు పెద్ద విశేషమే. 
rrrmovie
 
ఇకపోతే.. తెలుగునాట పోరాట యోధులుగా నిలచిన మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని మొదటి నుంచీ వినిపించడంతో అందరిలోనూ మరింత ఆసక్తి నెలకొంది. సీతారామరాజు.. కొమరం భీమ్.. వీరిద్దరూ తెలుగువారికి చిరస్మరణీయులే. కానీ, ఏ నాడూ కలుసుకోలేదు. మరి అలాంటి వారిద్దరినీ రాజమౌళి ఎలా కలిపారు అన్న ఆసక్తి ఆర్.ఆర్.ఆర్.పై మరింత క్రేజ్‌ను పెంచింది.  
 
కథ ఏమిటంటే.
ఆర్.ఆర్.ఆర్ కథ 1920లలో ఢిల్లీ పరిసర ప్రాంతాలలో నివసించే వారి నేపథ్యంలో సాగుతుంది. రామరాజు, భీమ్ ఇద్దరికీ చిన్న తనం నుంచీ పోరాడే తత్వం ఉంటుంది. రామరాజుకు పోలీస్ కావాలన్న ఆసక్తి. అందుకు తగ్గట్టుగానే పెరిగి పెద్దయ్యాక నాటి బ్రిటిష్ గవర్నమెంట్ లో పోలీస్ ఇన్ స్పెక్టర్ అవుతాడు. ఇక భీమ్ తన జాతి గౌరవం కోసం శ్వాసనైనా విడిచే రకం. 
 
భీమ్ గోండు జాతికి చెందిన ఓ పచ్చబొట్లు పొడిచే పాపను బ్రిటిష్ ఆఫీసర్ భార్య తమతోనే ఉంచుకుందామని తీసుకువెళ్తుంది. ఆ పాప తన తల్లిని చూడాలని ఆరాటపడుతుంది. ఆ పసిదాని తల్లి కూడా తన కన్నబిడ్డను చూసుకోవాలని తపిస్తుంది. 
 
అయితే తల్లిబిడ్డలను కలవకుండా చేస్తారు బ్రిటిష్ వారి సేవకులు, సైనికులు. ఇది తెలిసి భీమ్ ఎలాగైనా తమ గోండు పాపను రక్షించాలనుకుంటాడు. ఇదిలా ఉంటే ఓ సందర్భంలో ఇన్ స్పెక్టర్ రామ్, కొమరం భీమ్ కలుసుకుంటారు. వారిద్దరి మధ్య స్నేహం బలపడుతుంది. 
RRR song still
 
ముస్లిమ్ లాగా కనిపించే భీమ్, చలాకీగా ఉండే రామ్ ఇద్దరూ తమ అసలు లక్ష్యాలను చెప్పుకోరు. కానీ, వారి స్నేహబంధం మాత్రం చెరిగిపోనిది. బ్రిటిష్ జనాన్నీ వాళ్ళు కలుసుకుంటూ ఉంటారు. ఓ సందర్భంలో తమ డాన్సుల్లాగా మీ నాట్యం ఉండదు అని బ్రిటిష్ వాళ్ళు గేలి చేస్తారు. దాంతో ఈ ఇద్దరు మిత్రులు తమ 'నాటు' డాన్స్ తో రక్తి కట్టిస్తారు. 
 
ఇలా ఆనందంగా సాగుతున్న వారి స్నేహబంధాన్ని విధి విడదీసే ప్రయత్నం చేస్తుంది. తమ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న గోండు నాయకుడు భీమ్ ను పట్టుకోవాలని గవర్నమెంట్ భావిస్తుంది. అందుకు సరైన పోలీస్ ఇన్ స్పెక్టర్ రామ్ అని భావించి, అతణ్ణి నియమిస్తుంది. భీమ్ ను బంధించి తెస్తే, మరింత ఉన్నత స్థానానికి వెళతావనీ ప్రభుత్వం హామీ ఇస్తుంది. 
 
దాంతో రామ్ ఉత్సాహంగా భీమ్‌ను పట్టుకొనే ప్రయత్నం మొదలు పెడతాడు. అలా రామ్ కు తన మిత్రుడే భీమ్ అన్న విషయం తెలుస్తుంది. అలాగే భీమ్ తన స్నేహితుడే బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ రామ్ అని తెలుసుకుంటాడు. తనను రామ్ మోసం చేశాడని భీమ్, తన వద్ద భీమ్ రహస్యం దాచాడని రామ్ భావిస్తారు. 
 
ఎవరికి వారు ద్రోహానికి గురయ్యామని భావించి, ఇద్దరూ పోట్లాడుకుంటారు. అప్పటివరకూ ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ ఇద్దరు మిత్రుల నడుమ పోరు చూస్తే మనసులు ద్రవిస్తాయి. 
 
చివరకు తమ పోరుకు కారణం తమలోని స్నేహమే అని భావిస్తారు. రామ్ ఉద్యోగ ధర్మంతోనే తనతో పోరాడాడు అని అర్థం చేసుకున్న భీమ్ స్నేహానికి కట్టుబడి లొంగిపోతాడు. ఇక మిగిలిన కథ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   
 
విశ్లేషణ:
రాజమౌళి అద్భుతంగా ఈ సినిమాను తెరక్కించారు. కరోనా కారణంగా జాప్యం జరిగిన సందర్భాన్ని సైతం తమ ప్రాజెక్ట్ కు అనువుగా మలచుకున్నారాయన. దాంతో ఆర్.ఆర్.ఆర్.ను మరింత జనరంజకంగా మలిచేందుకు ఈ సినిమాను '3డి'లోనూ రూపొందించారు. మామూలుగానే కొన్ని సన్నివేశాలు తెరపై చూస్తోంటే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి.
 
ఇక త్రీడీలో ఆ ఎఫెక్ట్ మరింత బాగా ఉంటుదని చెప్పవచ్చు. ముఖ్యంగా యన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఇంట్రవెల్ కు ముందు చోటు చేసుకున్న పోరాట దృశ్యాలు చూపరులకు భలే అనిపించాయి. 
rrrmovie still
 
ఇక 'బాహుబలి' రెండు భాగాల్లోలాగే ఇందులోనూ యాక్షన్ కు ప్రాధాన్యమిచ్చారు రాజమౌళి. పతాక సన్నివేశాలలో వచ్చే పోరాటాలు, వ్యూహాలు సైతం ఆకట్టుకొనేలా తెరకెక్కాయి. 
 
ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని వారి అభిమానులు ఎవరూ నిరాశ చెందకుండా ఉండేలా కథను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. 
 
అలాగే ఒకరి పాత్ర ఎక్కువ, ఒకరి పాత్ర నిడివి తక్కువ అన్న ఆలోచన రాకుండా ఆయన జాగ్రత్త పడ్డారనే చెప్పవచ్చు. ఇతర పాత్రధారులతోనూ తనకు కావలసిన నటనను రాబట్టుకొని రక్తి కట్టించారు.
 
సాంకేతిక నైపుణ్యం.
తన సాంకేతిక నిపుణుల నుండి తనకు కావలసిన ఎఫెక్ట్ ను రాబట్టడంలోనూ భళా అనిపించారు రాజమౌళి. ముఖ్యంగా కథకు అనువైన విధంగా కె.కె.సెంథిల్ కుమార్ కెమెరా పనితనం కనిపిస్తుంది. ఆ సన్నివేశాలకు తగ్గ నేపథ్య సంగీతమూ వినిపించారు కీరవాణి. పాత్రోచితమైన మాటలతో బుర్రా సాయిమాధవ్ కూడా ఆకట్టుకున్నారు.
 
పాత్రల తీరు.
కొమరం భీమ్ గా జూ.యన్టీఆర్, రామరాజుగా రామ్ చరణ్ నటించలేదు, ఆ పాత్రలోనే జీవించారు. ఇద్దరూ పోటాపోటీగా తమ పాత్రలను నిర్వహించారని చెప్పవచ్చు. సినిమాను బాగా గమనిస్తే ఇందులోని ప్రధాన పాత్రల నేపథ్యంలో పంచభూతాలు మనకు కనిపిస్తాయి. 
 
గోండు జాతి పసిపాప నింగి అయితే, రామరాజు పాత్రలో అగ్ని, భీమ్ పాత్రలో జలం కనిపిస్తాయి. ఇక రామ్ చరణ్ కు గురువుగా ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే అజయ్ దేవగణ్ పాత్ర వాయువును పోలి ఉంటుంది. రామరాజు కోసం తపించే సీత పాత్రలో భూమి కనిపిస్తుంది. 
Rajamouli-NTR-Ramcharan
 
ఇలా మలచిన రచయితలను, వాటిని అదే తీరున తెరకెక్కించిన దర్శకుణ్ణి అభినందించి తీరాలి.  సీత పాత్ర నిడివి తక్కువే అయినా అలియా భట్ పరిమితి మేరకు నటించింది. రామరాజుకు స్పూర్తి కలిగించిన గురువుగా అజయ్ దేవగణ్ తనదైన అభినయం చూపించారు.
 
శ్రియ పాత్ర నిడివి మరీ చిన్నది. జెన్నీఫర్ గా నటించిన ఒలివియా మారిస్ కనిపించినంత సేపూ ఆకట్టుకుంది. రాహుల్ రామకృష్ణ భీమ్ మిత్రునిగా ఒదిగిపోయాడు. పాటలు, గ్రాఫిక్స్ అన్నీ బాగున్నాయి. 
 
రేటింగ్: 3.5/5