ఫోను మోగింది. పుస్తకం చదువుతున్న నేను లేచి ఫోనెత్తి ''హలో'' అనగానే, ''ఎలా వున్నావ్ తమ్ముడూ... బావున్నావా?'' అంటూ పలకరించాడు మోహన్ రావు. ఫర్వాలేదన్నాను, నువ్వెలా వున్నావ్, నీ ఆరోగ్యం బావుందా అన్నా. ఏం చెబుతామయ్యా ఈ వయసులో బాగా వున్నామని చెప్పలేం. ఎన్నో రోగాలు వాటికి మందులు వాడుతూ ఉన్నా. అదిసరేగానీ నీవు ఎలా వున్నావని శంకర రావును అడిగారు. నేనూ అలాంటి సమాధానమే చెప్పాను, ఆరోగ్యం అంతంతమాత్రమేనని. అదిసరేగానీ ఈ సంవత్సరం మార్చి 30న నాకు 80 సంవత్సరాలు నిండుతాయి. పిల్లలు అశీతి వేడుకలు చేస్తామంటున్నారు. నువ్వు తప్పకుండా రావాలి. రెండు నెలలు ముందే చెబుతున్నాను. నువ్వు, నీ భార్య సృజన తప్పకుండా రావాలి అన్నాడు. సృజనకు ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. తను రాలేదేమో అంటే అదేం కుదరదు. మీ ఇద్దరూ రావలసిందే. ఏవో కుంటిసాకులు చెప్పవద్దు. అందరం కలిసి నాలుగు రోజులు సరదాగా గడుపుదాం. నా భార్య మాధవి మీ ఇద్దరినీ తప్పకుండా రమ్మంది. ఇపుడే టికెట్లు రిజర్వ్ చేసుకోమంది అన్నాడు. సరే అని ఫోన్ పెట్టేశాను.
ఎవరూ ఫోన్... అంటూ వంటింట్లో నుంచి వచ్చింది సృజన. మా క్లాస్‌మేట్ మోహన్ రావుకు మార్చి 30 తారీఖున 80 సంవత్సరాలు నిండుతాయి. పిల్లలు వేడుకలు చేస్తున్నారట. మనల్ని రమ్మన్నాడు... అంటే ఇంకేం వెళ్లొద్దాం టికెట్లు రిజర్వ్ చేయండి అంది సృజన. మళ్లీ ఆలస్యం చేస్తే టికెట్లు దొరకవేమో అనే భయంతో రానుపోనూ టికెట్లు బెంగళూరుకు చేశాను. మనసు గతంలోకి వెళ్లింది.
దాదాపు 55 సంవత్సరాల క్రితం మోహన్ రావు నేను ఎంఏలో సహాధ్యాయులం. మాకు హాస్టల్‌లో సీటు దొరకలేదు అద్దెకు ఒక గది తీసుకుని వుండేవాళ్లం. ఇద్దరం వేర్వేరు ప్రాంతాలవాళ్లం. మా కులాలు కూడా ఒకటి కాదు. అయినా మేమిద్దరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్లం. అతను నాకంటే నాలుగేళ్లు పెద్దవాడు. అతడు బీఏ అవగానే నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసి పెద్ద చదువులు చదివి లెక్చరర్‌గా ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో ఎంఏలో చేరాడు. అందువల్ల అతని అభిప్రాయాలు పరిణతి చెంది వుండేవి.
నేను విశ్వవిద్యాలయంలో అల్లరి చేస్తూ ఉండేవాడిని. తప్పు.. అలా అల్లరి చేయకూడదు. ముఖ్యంగా ముందు మనం గురువులను గౌరవించాలి. వాళ్లు చెప్పినట్లు నడచుకోవాలి. అపుడే వాళ్లకు మనమీద అభిమానం కలుగుతుంది అనేవాడు మోహన్ రావు. మోహన్ రావు బాగా కష్టపడి చదివేవాడు. నువ్వు చదువుకోరా తమ్ముడు శంకర్రావ్ అంటూ నన్ను చదివించేవాడు. అతను ఎపుడూ మా క్లాసులో ప్రధమ స్థానంలో ఉండేవాడు. నేను ద్వితీయ స్థానంలో ఉండేవాడిని.
నేను సిగరెట్లు తాగేవాడిని. తప్పు, అది చాలా చెడ్డ అలవాటు. నువ్వు మానేయవయ్యా అప్పుడే నీ ఆరోగ్యం బాగుపడుతుంది అని గొడవ చేసేవాడు. ఎంఏ చదివేటపుడు సిగరెట్లు మానలేకపోయాను. తర్వాతి కాలంలో ఆయన మాట గుర్తుంచుకుని సిగరెట్లు కాల్చకూడదనే పట్టుదలతో మానివేశాను. అతను ఎపుడూ దండీలు, బస్కీలు వంటి వ్యాయామం చేస్తూ నన్ను కూడా చేయమనేవాడు. నేను కూడా అతినితో చేరి వ్యాయామం చేసేవాడిని. అతను బ్రాహ్మణుడు. శాకాహారి, పళ్లు బాగా తీసుకుంటుండేవాడు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క రకం పళ్లు తెచ్చుకుని తను తింటూ నన్నూ తినమని నాకూ అలవాటు చేశాడు. పళ్లు తింటే ఆరోగ్యం చాలా బావుంటుందనేవాడు. ఇవాళ సైంటిస్టులందరూ అదేమాట కదా చెపుతున్నారు. మొత్తమ్మీద అతనివల్ల నాకు అలవాట్లు మారినాయి. ఈరోజుకి మాత్రం ఆరోగ్యంగా ఉన్నానంటే అతను నాకు నేర్పించిన మంచి అలవాట్లే కారణం.
ఎంఏలో 20 మంది విద్యార్థుల్లో అతను ప్రథమ స్థానంలోనూ, నేను ద్వితీయ స్థానంలోనూ ఉత్తీర్ణులయ్యాము. ఖాళీ సమయాల్లో జంట కవిత్వం వ్రాసేవాళ్లం. ఆ పద్యాలు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. సభల్లో మా జంట కవిత్వం అపుడపుడు వినిపించేవాళ్లం. ఆ రోజుల్లో ఎంఏ పాసవగానే లెక్చరర్ ఉద్యోగాలు వెంటనే దొరికేవి. కాని నేను, మోహన్ రావు పిహెచ్‌డి చేయాలనే పట్టుదలతో పిహెచ్ డిలో చేరాం. 1960 ప్రాంతంలో పీహెచ్ డి చేయటమంటే చాలా గొప్ప. ఉద్యోగాలు తేలికగా దొరికేవి. డాక్టరేట్ పట్టా సంపాదించాలనే పట్టుదలతో పిహెచ్‌డి లో చేరాం.
మోహన్ రావుకు ఎంఏ చదవడానికి ముందే పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. నాకు ఎంఏ అవగానే పెళ్లయింది. పిహెచ్ డి లో చేరగానే దగ్గర దగ్గరగా ఇళ్లు తీసుకుని కాపురాలు పెట్టాం. వాళ్లింటికి మేము మా ఇంటికి వాళ్లు వస్తూపోతూ ఉండేవాళ్లం. తను పిహెచ్ డిలో కేంద్రప్రభుత్వం వారి లోను స్కాలర్ షిప్ తీసుకుని తర్వాత నాకూ ఆ లోను స్కాలర్ షిప్ కు అప్లై చేయించి ఇప్పించాడు. యుజిసి పరీక్ష పాసైతే జీఆర్ఎఫ్ స్కాలర్ షిప్ ఆయనకు వచ్చింది. ఆ తర్వాత సంవత్సరానికి నాకు వచ్చింది. మా స్నేహం దినదినప్రవర్ధమానమైంది. ఇద్దరివీ పిహెచ్ డీలు పూర్తయినాక ఉద్యోగాలకు నేను హైదరాబాద్, మోహన్ రావు బెంగళూరు వెళ్లి అక్కడే స్థిరపడిపోయాం. వీలైనపుడల్లా మేము కలుస్తూనే ఉండేవాళ్లం. మా స్నేహం నాటి నుంచి నేటి వరకూ చక్కగా కొనసాగుతూనే ఉంది. మేమిద్దరం రిటైరై చాలా కాలమైంది. ఇంకా ఈమాత్రం ఆరోగ్యంగా వున్నామంటే మేము పాటించే అలవాట్లే అని చెప్పవచ్చు.
గతంలో నుంచి వర్తమానంలోకి వచ్చాను. అతని పిల్లలు పెద్దవాళ్లయి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అందరికీ పెళ్లిళ్లయి పిల్లు ఉన్నారు. మాకూ ఇద్దరు మగపిల్లలు. వాళ్లు బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్లకూ పిల్లలు కలిగారు. అందరం హాయిగా ఉన్నాం.
అనుకున్నరోజు రానే వచ్చింది. నేను సృజన బెంగళూరు వెళ్లాం. మోహన్ రావు చిన్నకొడుకు శ్రీనాథ్ రైల్వేస్టేషనుకు వచ్చి మమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లగానే రావయ్యా శంకర్, ఎన్నాళ్లయిందయ్యా నిన్ను చూసి అంటూ వచ్చి మోహన్ రావు ప్రేమగా కౌగలించుకున్నాడు. నాకు ఆనందంతో కళ్లలో నీరు ఉబికి వచ్చింది. మా ఇద్దరినీ ఆ స్థితిలో చూసి ఇంట్లో ఉన్న జనమంతా తెగ సంతోషపడిపోయారు. ఇక ఆ తర్వాత చెప్పేదేముంది. అందరం కబుర్లలో పడిపోయాం.
మోహనరావు పిల్లలు వాళ్ల పిల్లలతో సహా వచ్చారు. ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. మోహన్ రావు పిల్లలు నన్ను బాబాయి బాబాయి అంటూ ఎంతో ప్రేమగా వాళ్లు చిన్నప్పుడు నాతో గడిపిన సమయం సందర్భాలు గురించి ముచ్చటిస్తూ వుంటే నాకెంతో సంతోషంగా ఉంది. దీపావళి పండగకి కాల్చిన టపాసులు అవీ గుర్తుచేసుకున్నారు. గంగమ్మ జాతరలో వేషాల గురించి మననం చేసుకున్నారు. వాళ్లింట్లో అందరూ అంత ప్రేమగా మాట్లాడుతూ వుంటే అది ప్రేమ నివాసమా అన్నట్లుంది. నిజంగా అది ప్రేమ మందిరం.
మరు రోజు ఉదయం ఐదు గంటలకు పురోహితులు వచ్చారు. మోహన రావు దంపతులతో హోమాలు చేయించారు. ఆ తర్వాత మోహన్ రావు దంపతులిద్దరూ కుర్చీలో కూర్చుంటే చిన్నవాళ్లందరూ వాళ్లకు పాదాభివందనాలు చేస్తూ కానుకలు సమర్పించారు. మోహనరావు దంపతులు వారిని ఆశీర్వదించారు. నేను సృజన మోహనరావు దంపతులకు మేము తెచ్చిన కానుకలిచ్చి వాళ్ల ఆశీర్వదాలందుకున్నాము. వాళ్ల కళ్లల్లో మా కళ్లల్లో ఆనంద బాష్పాలు. అది అపురూపమైన సంఘటన. ఆ తర్వాత భోజనాలయినాయి.
భోజనాలయ్యాక విశ్రాంతి తీసుకుంటున్న నా దగ్గరకు మోహన్ రావు వచ్చారు. శంకర్రావు సాయంకాలం నేను పండితులైన కొంతమంది స్నేహితులను సన్మానం చేయాలనుకుంటున్నాను. నీకే మొదటి సన్మానం. సాయంకాలం ఆరు గంటలకు సన్మాన కార్యక్రమం మొదలవుతుంది. ఏమిటీ ఇంతవరకు ఈ విషయం నాతో చెప్పలేదు అన్నా. నిన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలనే మేమెవ్వరం నీకు చెప్పలేదు అన్నాడు. బావున్నాయి మీ ఏర్పాట్లు అని మెచ్చుకున్నా.
సాయంత్రం ఆరు గంటలకు సన్మాన కార్యక్రమం మొదలైంది. మోహన్ రావు మా ఇరువురి స్నేహం గురుంచి మా అనుబంధం గురించి పది నిమిషాలు మాట్లాడాడు. శాలువా కప్పి సన్మానించాడు. అందమైన పూసలతో తయారుచేసిన దండను నా మెడలో వేసి నీ ప్రియ నేస్తం అంటూ నన్ను కౌగలించుకున్నాడు. ఆ తర్వాత అందమైన జ్ఞాపికను బహూకరించాడు. ఇపుడొక చిన్న ప్రకటన అన్నాడు మోహన్ రావు. శంకర్రావును సన్మానించడానికి మాధవరావు ఉబలాటపడుతున్నాడు. రావయ్యా మాధవరావూ అన్నాడు. నేను ఆశ్చర్యంతో చూస్తున్నాను. మాధవరావు ఎవరా అని.
మాధవరావు నా దగ్గరకు వచ్చి నా పాదాలంటి నమస్కరించి, నేను మాష్టారు గుర్తున్నానా... అంటుంటే నేను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేను మాష్టారు 30 సంవత్సరాల క్రితం మిమ్మల్ని దొండపాడులో కలిశాను... అనగానే అవునవును గుర్తుకు వచ్చిందంటూ తలాడించాను. మాధవరావు నన్ను శాలువాతో సత్కరించి పెద్దదైన వేంకటేశ్వర స్వామి పటం బహూకరించాడు. దానితోపాటు పార్కర్ పెన్ను సెట్టు బహూకరించాడు. నాకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అర్థంకాలేదు. ఇంత పెద్దఎత్తున సన్మానం చేసే ఈ మాధవరావుకు నేనేమి సహాయం చేశానా అని గతంలోకి వెళ్లబోయాను.
ఇంతలో మాధవరావు మైకు అందుకుని రెండు నిమిషాలు నన్ను మాట్లాడటానికి అనుమతించడని మోహన్ రావుని అడిగితే ఆయన సరేనన్నారు. శంకర్రావుగారి దయ వల్ల నేను జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగాను. నేను 30 సంవత్సరాల క్రితం దొండపాడు గ్రాంలో ఎలిమెంటరీ స్కూలు టీచరుగా చేసేవాడిని. శంకర్రావుగారు వేసవి సెలవులకు దొండపాడు వచ్చేవారు. అప్పటికే నేను ఎంఏ పాసయ్యాను. ఎంఫిల్ చేయాలనుకుంటున్నాను మాష్టారు మీ దగ్గర అన్నాను. నా దగ్గర ఖాళీలు లేవయ్యా, నా స్నేహితుడు మోహన్ రావు బెంగళూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాడు. అతని దగ్గరకు వెళ్లు. నేను చెపుతాను. అతను నీకు తప్పక సహాయం చేస్తాడన్నారు. ఆ తర్వాత నేను స్కూలు యాజమాన్యం పర్మిషన్ తీసుకుని బెంగళూరుకు వెళ్లాను. ఎంఫిల్ చేశాను. ఆ తర్వాత కొంతకాలం కోరుకొండ సైనిక్ స్కూల్లో పని చేశాను. తర్వాత జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా చేరాను. నిదానంగా ప్రైవేటుగా పిహెచ్ డి పూర్తి చేశాను. జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ గా చేసే రిటైరయ్యాను. మా పిల్లలు పెద్దవారై ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తుంటే నేను కూడా ఇక్కడే బెంగళూరులో వుంటున్నాను.
మా గురువుగారైన మోహన్ రావు మాష్టారు చెప్పారు శంకర్రావు గారు ఇక్కడికి వస్తున్నారని. శంకర్రావు గారిని సన్మానించుకునే అవకాశం నాకిమ్మని మా గురువుగారిని అడిగాను. ఆయన అలాగే అన్నారు. ఆఖరి నిమిషం వరకూ ఈ విషయం శంకర్రావుగారికి చెప్పవద్దు. శంకర్రావును ఆశ్చర్యపరచాలి అన్నారు. అందువల్ల మేమందరం కలిసి ఇలా చేశాం. నా ఈ ఉన్నత స్థితికి కారకులైన శంకర్రావు గారికి మోహన్ రావు గారికి సభాపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానన్నారు. అతని గొంతు ప్రేమతో గద్గదమైంది.
ఇదంతా విన్న నాకు ఆశ్చర్యంతో నోట మాట రావడంలేదు. అయినా తమాయించుకుని గొంతు సవరించుకున్నాను. మైకు అందుకున్నాను. నేను జీవితంలో ఎంతోందికి ఎన్నో రకాలుగా సహాయం చేశాను. నావల్ల ఎంతో పెద్ద సహాయం పొందినవారు కూడా ఆ సహాయాన్ని మర్చిపోయినవాళ్లున్నారు. కొందరు మరవకపోయినా మళ్లీ కనబడటం లేదు. ఎన్నడో ఏదో మాట సాయం చేసినందుకు ఈనాడు ఈ మాధవరావు ఇంతమందిలో నన్ను ఇంత ఘనంగా సన్మానించండ ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది అన్నారు. చిన్న సహాయంకాదు మాష్టారు... మీ మాట సాయమే ఎలిమెంటరీ స్కూలు టీచర్ నుంచి కాలేజీ ప్రిన్సిపాల్ గా చేసింది. మీ సహాయానికి ధన్యుడిని అన్నాడు మాధవరావు. మోహనరావు మైకు అందుకుని ఇవాళ ఇద్దరు మంచి మనసున్న వాళ్లను కలిశాం. కళ్లారా చూశాం. ఆనందించాం. మానవత్వం పరిమళించింది అన్నారు. హాలంతా చప్పట్లతో మారుమోగింది. విన్నవారి మనసులు వికసించాయి.
- శ్రీమతి లింగంనేని సుజాత శంకర్.