బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 1 అక్టోబరు 2017 (12:20 IST)

శ్రీవారికి వైభవంగా చక్రస్నానం (Video)

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు చక్రస్నాన ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి చివరి రూపమైన అర్చా విగ్రహానికి చక్రస్నానం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి, ఉ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు చక్రస్నాన ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి చివరి రూపమైన అర్చా విగ్రహానికి చక్రస్నానం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి, ఉభయదేవేరులు, చక్రత్వాళ్వారుకి స్నపన తిరుమజనం నిర్వహించారు.
 
ఆ తర్వాత స్వామి వారి ప్రతినిధిగా చక్రత్వాళ్వారుకి వరాహ పుష్కరిణిలో స్నానమాచరింపజేశారు. చక్రస్నానం తర్వాత తిరుమలేశుడు ఆనంద నిలయానికి చేరుకున్నారు. వెంకటేశ్వరుని అవతార నక్షత్రమైన శ్రవణ పర్వదినాన చక్రస్నాన కార్యక్రమ ఘట్టం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెల్సిందే. స్వామి చక్రస్నానాన్ని స్వయంగా కనులారా వీక్షించే భక్తులకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని విశ్వాసం.
 
కాగా, స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి అశ్వవాహన సేవను నిర్వహించారు. ఈ సేవలో స్వామివారు అశ్వవాహనంపై తిరుమాడవీధుల్లో విహరించారు. శ్రీ మహావిష్ణువు కలియుగాంతంలో కల్కిగా అవతరిస్తాడని కోట్లాదిమంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. 
 
అశ్వం అంటే వేగానికి ప్రతీక. అందుకనే మన ఇతిహాసాలతో పాటు చరిత్రలో అశ్వానికి విశిష్టమైన స్థానముంది. చతురంగ బలాల్లో అశ్వదళానిదే కీలకపాత్ర. మలయప్పస్వామి అశ్వవాహనంపై ఒంటరిగా శిరస్త్రాణాన్ని ధరించి చేతిలో ఖడ్గం చేతబూని భక్తులకు దర్శనమిచ్చారు. 
 
అమృతం కోసం సాగరాన్ని మధించిన సమయంలో ఉచ్ఛైశ్రవం అనే అశ్వరాజం జన్మించింది. కఠోపనిషత్తులో మానవ ఇంద్రియాలను అశ్వాలుగా పేర్కొన్నారు. కలియుగం చివర్లో స్వామి కల్కి రూపంలో వచ్చి దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేస్తారు. అశ్వవాహనంపై ఆసీనులైన స్వామివారిని దర్శిస్తేభక్తులకు భౌతికమైన జ్ఞానేంద్రియాలను కట్టుదిట్టం చేసి దివ్యమైన జ్ఞానం ప్రసాదిస్తారు.