మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: మంగళవారం, 4 మే 2021 (17:49 IST)

కరోనా దెబ్బకు 75 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు, లాక్ డౌన్ విధిస్తే...?

కోవిడ్ -19 మహమ్మారి సెకెండ్ వేవ్‌లో స్థానికంగా విధిస్తున్న లాక్‌డౌన్‌, ఇత‌ర ఆంక్ష‌ల కారణంగా దేశంలో 75 ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఈ) ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. సిఎమ్ఐఈ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేష్ వ్యాస్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉద్యోగ క‌ల్ప‌న సవాలుగా మార‌నున్న‌ద‌ని భావిస్తున్నాన‌న్నారు. మార్చితో పోల్చితే ఏప్రిల్ నెలలో 75 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయార‌ని తెలిపారు. ఫ‌లితంగా నిరుద్యోగ రేటు పెరిగింది
 
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం జాతీయ నిరుద్యోగిత రేటు 7.97 శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 9.13 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 7.13 శాతంగా ఉంది. అంతకుముందు మార్చిలో జాతీయ నిరుద్యోగిత రేటు 6.50 శాతంగా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు చాలా తక్కువగా ఉంది.

కోవిడ్ -19 మహమ్మారి విజృంభ‌ణ కార‌ణంగా అనేక రాష్ట్రాల‌లో లాక్‌డౌన్‌తో సహా ప‌లు ఆంక్షలను విధించారు. ఇది ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి ఎప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుంటుందో తెలియడం లేద‌ని, అయితే దీని కార‌ణంగా ఉపాధిపై ఒత్తిడి ఏర్ప‌డ‌ట‌మ‌నేది ఖచ్చితంగా చూడవచ్చని వ్యాస్ అన్నారు. అయితే, ప్రస్తుత లాక్‌డౌన్‌లో... గ‌తంలో త‌లెత్తినంత దారుణ ప‌రిస్థితులు లేవ‌ని ఆయన అన్నారు. గ‌తంలో నిరుద్యోగిత రేటు 24 శాతానికి చేరుకుంద‌న్నారు.