మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (10:50 IST)

తృప్తి దేశాయ్‌ను ఒక్క అంగుళం కూడా కదలనివ్వం... శబరిమలకు ఎలా వెళ్తారో చూస్తాం...

భక్తుల దర్శనార్థం శబరిమల ఆలయం శుక్రవారం తెరుచుకోనుంది. ఈ ఆలయ దర్శనం కోసం వచ్చిన భూమాత బిగ్రేడ్ వ్యవస్థాపకురాలు తృప్తిదేశాయ్‌ను అయ్యప్ప భక్తులు ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించారు. ఆమె శబరిమలకు వస్తున్నట్టు తెలుసుకున్న అయ్యప్ప భక్తులు, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున విమానాశ్రయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో కొచ్చి విమానాశ్రయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
తృప్తి బృందాన్ని ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రానివ్వబోమంటూ వారు హెచ్చరించి విమానశ్రయం ఎదుట బైఠాయించారు. వీరికి టాక్సీ డ్రైవర్లు కూడా మద్దతు ప్రకటించారు. దీంతో తృప్తి బృందాన్ని విమానాశ్రయం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు నిరాకరించారు. అదేసమయంలో తాను శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టకుండా తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పింది. 
 
ఇదిలావుంటే, శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వస్తున్నానని, తనకు తగిన భద్రత కల్పించాలంటూ కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు తృప్తి దేశాయ్ ఇప్పటికే ఓ లేఖ కూడా రాసింది. దీంతో ఆమెకు గట్టి భద్రతను కల్పించేందుకు కేరళ పోలీసులు చర్యలు చేపట్టారు. 
 
ఇదిలావుండగా, 2016లో తన బృందంతో కలిసి మహారాష్ట్రలోని శని సింగణాపూర్ ఆలయంలోకి తృప్తి దేశాయ్ ప్రవేశించిన విషయం తెల్సిందే. ఈ ఆలయంలో 60 యేళ్ల నుంచి మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న నిషేధానికి ఆమె తెరదించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న అనేక మంది మహిళలు తమకు ప్రవేశం ఆలయాల్లోకి ప్రవేశించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. అలాంటి ఆలయాల్లో శబరిమల ఆలయం కూడా ఒకటి. 
 
మరోవైపు, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై కొనసాగుతూ వచ్చిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇటీవల ఎత్తివేసింది. ఈ వివాదాస్పద తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించి, జనవరి 22వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మేరకు మహిళలకు ప్రవేశం కల్పించాలని ఆదేశాలు జారీచేసింది.