మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 18 అక్టోబరు 2018 (19:03 IST)

శబరిమల అయ్యప్పను చూసేందుకు ఆ వయసు ఆడవారిని వెళ్లనివ్వం...

శబరిమలలో మహిళలు అయ్యప్ప స్వామి ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో ఉధృతంగా నిరసనలు జరుగుతున్నాయి. నిషేధిత వయస్సుల్లోని మహిళలెవ్వరూ ఆలయంలోకి వెళ్లకుండా భక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. శబరిమల కొండ పరిసరాల్లో మహిళలు సహా అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో కొండకు వెళ్లే దారులకు చేరుకుని, నిషేధిత వయస్సు అమ్మాయిలు, స్త్రీలను ఆలయానికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు అయ్యప్పభక్తులు. 
 
అయితే కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు... పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చింది శబరిమల యాక్షన్‌ కౌన్సిల్‌, అయ్యప్ప సేవాసంఘం. ఈ బంద్‌కు బీజేపీ, ఇతర ఎన్డీయే పార్టీలు మద్దతు ప్రకటించాయి. తీవ్ర ఉద్రిక్తతల మధ్య నిన్న ఓ 18 ఏళ్ల వయసున్న అమ్మాయి గుడిలోకి ప్రవేశించింది. 
 
అయితే నిన్న రాత్రి శబరిమలకి వెళ్లేందుకు ప్రయత్నించిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాధవి అనే మహిళను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. ఆమెకు కొంతవరకు మాత్రమే పోలీసులు ప్రొటెక్షన్ కల్పించినా, ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఆలయంలోకి వెళ్లకుండానే మాధవి వెనుతిరిగింది. 
 
శబరిమలలో సన్నిధానం దగ్గర వున్న పరిస్థితులను ‌కవర్ చేయడానికి పంబకి బయలుదేరిన న్యూయార్క్ టైమ్స్ మహిళా రిపోర్టర్ సుహాసిని రాజ్‌ను మార్గం మధ్యలోనే భక్తులు అడ్డుకున్నారు. తాను దర్శనానికి కాదు కవరేజ్ నిమిత్తం వెళుతున్నానని చెప్పడంతో సదరు రిపోర్టర్‌ను అనుమతించారు.