బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (09:25 IST)

వ్యోమగామిని పెళ్లి చేసుకున్న నటి లీనా : అధికారికంగా వెల్లడి!!

leena
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో త్వరలోనే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ యాత్రను చేపట్టనుంది. ఇందులో అంతరిక్ష కేంద్రానికి వెళ్లే నలుగురు భారత వ్యోమగాముల పేర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం అధికారికంగా వెల్లడించారు. ఈ నలుగురు వ్యోమగాముల్లో ఒకరైన కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను మలయాళ సినీ నటి లీనా పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. జనవరి 17, 2024న వివాహం జరిగిందని, సంప్రదాయ పద్ధతిలో తాము ఒక్కటయ్యామని 'ఇన్‌స్టాగ్రామ్" వేదికగా మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
 
'ఈరోజు (ఫిబ్రవరి 27) దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారత వైమానిక దళ పైలట్, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు మొదటి భారతీయ వ్యోమగామి 'వింగ్స్'ను అందజేశారు. ఈ చారిత్రాత్మక క్షణం దేశానికి, కేరళ రాష్ట్రానికి, వ్యక్తిగతంగా నాకు గర్వించదగింది. అధికారికంగా గోప్యత పాటించాల్సి ఉన్నందున మా పెళ్లి గురించి ప్రకటించలేదు. జనవరి 17, 2024న సాంప్రదాయ పద్ధతిలో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నామని మీకు తెలియజేయడానికి ఈ క్షణం వరకు ఎదురుచూశాను' అని ఆమె ఇన్ పోస్టులో రాసుకొచ్చారు.
 
కాగా కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ కేరళలోని పాలక్కాడ్‌కు చెందినవారు. ఇక నటి లీనా జయరాజ్ పలు సినిమాల్లో నటించారు. 'స్నేహం' మూవీ ద్వారా ఆమె మలయాళ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. 'కరుణం', 'దేవదూతన్', 'ఇంద్రియమ్', 'కోచ్ కోచ్ సంతోష్మాన్', 'శాంతం' వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న లీనా తిరిగి ఈ మధ్య పలు పాత్రల్లో నటిస్తున్నారు. ఆమె పలు సీరియల్స్‌లోనూ నటించడం గమనార్హం.