శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : మంగళవారం, 7 ఆగస్టు 2018 (11:16 IST)

బ్లూ వేల్ తరహాలో డెడ్లీ గేమ్.. మోమో పేరిట వాట్సాప్‌లో చాపకింద నీరులా..?

బ్లూ వేల్ గేమ్ ఎంత డేంజరో తెలిసిందే. ఈ బ్లూవేల్ గేమ్ కొంతమంది చిన్నారుల ఆత్మహత్యకు కారణమైంది. ఈ గేమ్‌పై భారత్‌తో పాటు కొన్ని దేశాలు నిషేధం విధించిన నేపథ్యంలో.. తాజాగా అలాంటి డెడ్లీ గేమ్ మరొకటి కొంపముం

బ్లూ వేల్ గేమ్ ఎంత డేంజరో తెలిసిందే. ఈ బ్లూవేల్ గేమ్ కొంతమంది చిన్నారుల ఆత్మహత్యకు కారణమైంది. ఈ గేమ్‌పై భారత్‌తో పాటు కొన్ని దేశాలు నిషేధం విధించిన నేపథ్యంలో.. తాజాగా అలాంటి డెడ్లీ గేమ్ మరొకటి కొంపముంచేందుకు వచ్చేస్తోంది. ఇంకా సోషల్ మీడియాలో అది కాస్తా వైరల్ అవుతోంది. యువతనే లక్ష్యంగా ''మోమో గేమ్‌'' పేరుతో సూసైడ్‌ ఛాలెంజ్‌ను విసురుతున్నారు కొందరు కేటుగాళ్లు. 
 
ప్రస్తుతం వాట్సాప్‌లో చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ ఆన్‌లైన్‌ గేమ్‌కు ఓ వికృత రూపంతో కూడిన ముఖాన్ని జోడిస్తున్నారు. పక్షి కళ్లు మనిషి ముఖం కలిసున్న భయంకరమైన ఈ బొమ్మను చూస్తేనే జడుసుకుంటారు. ప్రస్తుతం సైబర్ మాయగాళ్లు మోమో ఛాలెంజ్ అనే గేమ్‌ను క్రియేట్ చేశారు. ఈ గేమ్‌లో భాగంగా తొలుత వాట్సాప్‌‌ మోమో పేరుతో ఓ మెస్సేజ్‌ వస్తుంది. దానికి మనం రిప్లై ఇచ్చామా అంతే వారి వలకు చిక్కినట్లే. బ్లూ వెల్‌ ఛాలెంజ్‌ లాగే ఇక్కడ కూడా రకరకాల టాస్కులిచ్చి మనల్ని వారి గుప్పిట్లోకి లాక్కుంటారు. 
 
మొదట్లో తెలియని నెంబర్ల నుంచి మెస్సేజ్‌లు రావడం రిప్లై ఇవ్వాలంటూ ఛాలెంజ్‌లు విసరడం ఆ తర్వాత పూర్తి చేయాలంటూ ఇంట్రెస్టింగ్ టాస్కులు పంపించడం జరుగుతుంది. అయితే ఛాలెంజ్‌ను ఒప్పుకుని మధ్యలో నిలిపేసినా లేకపోతే టాస్క్‌ను పూర్తి చేయలేకపోయినా బెదిరింపు సందేశాలు కూడా పంపిస్తుంటారు. టీనేజర్స్‌ ఇష్టంగా ఆడే గేమ్స్‌ నుంచి చివరకు వారిని ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసే లాస్ట్‌ టాస్క్‌ వరకు ఈ మృత్యుక్రీడ ఉంటుంది. చిట్టచివరన ఆత్మహత్య చేసుకునే సమయంలో ఆ దృశ్యాలను వీడియో తీయాలి. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే మోమో గేమ్‌ను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసినట్టే. 
 
ఈ గేమ్‌లో భాగంగా వారం క్రితం అర్జెంటీనాలో ఓ అమ్మాయి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా పోలీసులు ఆమె ఫోన్‌ను హ్యాక్‌ చేస్తే ఆమె మోమో గేమ్‌ ఆడినట్లు తేలింది. అప్పుడే మోమో ఛాలెంజ్‌ అనేది ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఆత్మహత్య సంబంధించిన దృశ్యాలను వీడియో కూడా తీసింది. 
 
మోమో గేమ్‌ ప్రభావం మాత్రం అర్జెంటీనా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర దేశాల్లో తీవ్రంగా కనిపిస్తోంది. మనదేశానికైతే ఇప్పటివరకు ఎంట్రీ ఇవ్వకపోయినా పోలీసులు మాత్రం హెచ్చరిస్తున్నారు. ఇది ఆన్ లైన్ గేమ్ కావడంతో ఇంకా భారత్ లోకి రాలేదని నమ్మకంగా చెప్పే పరిస్థితి మాత్రం లేదు. ఇలాంటి ఘటనలు వెలుగు చూడకుండా వుండాలంటే... ఈ గేమ్‌కు దూరంగా వుండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.