కరోనాకు కొత్త తోడు.. త్రిపురలో ఆఫ్రికన్ ఫీవర్.. జాగ్రత్తగా వుండాల్సిందే
కరోనాకు కొత్త తోడు వచ్చినట్లు కనిపిస్తోంది. దేశంలో ఢిల్లీ, యూపీల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోన్నట్లు తెలుస్తోంది. తద్వారా నాలుగో వేవ్ ఖాయమని సంకేతాలు అందుతున్నాయి. చైనా షాంఘైలో కోవిడ్ వల్ల మరణాలు సైతం సంభవిస్తోండటం ఆందోళనకు దారి తీస్తోంది. మాస్క్‌లను ధరించడాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,985 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 214 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 11,542గా నమోదైంది.
ఆదివారం నాటితో పోల్చుకుంటే కొత్త కేసులు రెట్టింపు అయ్యాయి. ఇది చాలదన్నట్లు.. కొత్తగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ పుట్టుకొచ్చింది. ఇది త్రిపురలో విస్తరించింది. సెపహిజల జిల్లాలోని దేవీపూర్‌లో ప్రభుత్వం నిర్వహిస్తోన్న పిగ్ బ్రీడింగ్ ఫామ్‌లో ఈ ఫీవర్ వెలుగులోకి వచ్చింది.
కొన్ని పందుల నమూనాలను పరీక్షించిన అనంతరం పశు సంవర్ధక శాఖ అధికారులు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు నిర్ధారించారు. తొలిదశలో మూడు పందుల్లో ఫీవర్ లక్షణాలు కనిపించాయని, మిగిలిన వాటికి కూడా సోకి ఉంటాయని అంచనా వేసినట్లు చెప్పారు.
పందుల నుంచి మనుషులకు విస్తరించే ప్రమాదం ఉన్నందున- బ్రీడింగ్ ఫామ్‌లో పని చేసే సిబ్బంది, కార్మికులకు పీసీఆర్ పరీక్షలను నిర్వహించినట్లు ప్రభుత్వ లాబొరేటరీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ మృనాల్ దత్త తెలిపారు. స్వైన్ ఫీవర్ బారిన పడిన పందులన్నింటినీ సామూహికంగా ఖననం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు.
కరోనా వైరస్‌కు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌కు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ) స్పష్టం చేసినప్పటికీ అప్రమత్తంగా ఉండక తప్పదని మృనాల్ దత్త చెప్పారు.