మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 మార్చి 2020 (16:31 IST)

సీఎం జగన్‌కు షాక్.. బాబాయ్ వివేకా హత్య కేసు సీబీఐకు : హైకోర్టు

వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి మరోమారు తేరుకోలోని దెబ్బతగిలింది. సొంతబాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. పైగా, హత్య జరిగి యేడాది గడిచినా కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని, అందువల్ల ఈ కేసు దర్యాప్తును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. 
 
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గత 2019 మార్చి 15వ తేదీన హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ కేసును ఛేదించేందుకు మూడుసార్లు సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అయినా, ఈ కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో నిందితులను ఇంతవరకూ తేల్చలేదు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, అల్లుడు హైకోర్టులో గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. అదేసమయంలో సీఎం జగన్ కూడా సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో వివేకా కుటుంబీకులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి తీర్పును వెలువరించింది. 
 
వైఎస్ వివేకానంద హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. సాధ్యమైనంత త్వరగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐను ఆదేశించింది. ఈ హత్య జరిగి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో సమయం చాలా కీలకం కనుక ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. 
 
ఈ కేసుకు సంబంధించి సీఎం జగన్ పిటిషన్ ఉపసంహరణ ప్రభావం దర్యాప్తుపై ఉండకూడదని సూచించింది. పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచే సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది. హైకోర్టు తాజా నిర్ణయం సీఎం జగన్‌కు గట్టిషాక్ వంటిందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.