శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 17 మే 2018 (09:23 IST)

రాజ్యాంగ ధర్మాసన తీర్పును తుంగలో తొక్కిన కర్ణాటక గవర్నర్

హంగ్ అసెంబ్లీ ఎర్పడిన కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ రసకందాయంలో పడింది. కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి బలం 118గా ఉంటే, ప్రభుత్వ ఏర్పాటుకు ఆ కూటమికి అవకాశం ఇవ్వకుండా 104 మంది సభ్యులు కలిగిన భారతీయ జనతా పార్టీకి

హంగ్ అసెంబ్లీ ఎర్పడిన కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ రసకందాయంలో పడింది. కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి బలం 118గా ఉంటే, ప్రభుత్వ ఏర్పాటుకు ఆ కూటమికి అవకాశం ఇవ్వకుండా 104 మంది సభ్యులు కలిగిన భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇది 12 యేళ్ల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కినట్టే. ఇదే ఇపుడు కమలనాథులకు గొంతులో పచ్చివెలక్కాయలా మారింది.
 
నాడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పరిశీలిస్తే, 2005లో బీహార్‌ అసెంబ్లీకి రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. మొదటిది ఫిబ్రవరిలో... రెండోసారి నవంబరులో. జేడీయూ, బీజేపీ ఎన్నికలకు ముందే ఎన్డీయే పేరిట పొత్తు పెట్టుకున్నాయి. ఫిబ్రవరి 27న జరిగిన తొలి ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను, ఎన్డీయేకు 92 స్థానాలు వచ్చాయి. పూర్తి మెజారిటీ రాలేదు. ఆర్జేడీకి 75 సీట్లు, లోక్‌జనశక్తికి 29 స్థానాలు లభించాయి. 
 
దీంతో ఎవరికీ మెజారిటీ లేదని భావించిన నాటి గవర్నర్‌ బూటాసింగ్‌ మార్చి 6న రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. ఏప్రిల్‌ 15కల్లా తమకు 115 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ఎన్డీయే తెలియపర్చింది. కానీ గవర్నర్‌ పట్టించుకోలేదు. ఎల్‌జేపీని చీల్చడానికి ఎన్డీయే ప్రయత్నిస్తోందని, భారీగా బేరసారాలు జరుగుతున్నాయని బూటాసింగ్‌ రాష్ట్రపతికి లేఖ రాశారు. అనంతరం మే 21న అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేశారు. మే 22 అర్థరాత్రి నాటి యూపీఏ ప్రభుత్వ కేబినెట్‌ సమావేశమై దాన్ని ఆమోదించి మాస్కో పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాంకు ఫ్యాక్స్‌లో పంపింది. ఆయన వెంటనే దాన్ని ఆమోదించారు. ఇది దుమారం రేపింది.
 
దీన్ని సవాల్ చేస్తూ రామేశ్వర ప్రసాద్ అనే ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీన్ని ఏడుగురు సభ్యులు కలిగిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పునిచ్చింది. 1994లో వెలువరించిన ఎస్‌ఆర్‌ బొమ్మై కేసులోనే విశదీకరించింది. 2006 జనవరిలో వెలువరించిన రామేశ్వర్‌ ప్రసాద్‌ కేసు తీర్పులో ఆ పరిమితులను మరింత విస్తృతం చేసి మెరుగులు దిద్దింది.
 
'ఎన్నికలు ముగిశాక కూడా పార్టీలు పొత్తులు పెట్టుకోవచ్చు. సైద్ధాంతిక సారూప్యత ఆధారంగా ఒకే గొడుగు కిందకి రావడం తప్పు కాదు. అలా ఏర్పడిన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చి - సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన బలం తమకు ఉందని చెప్పి - గవర్నర్‌ను సంతృప్తి పరిస్తే గవర్నర్‌ దానిని తిరస్కరించడానికి వీలు లేదు. అనైతికంగా, అక్రమంగా ఆ మెజారిటీ సాధించారని తాను భావించి వారికి అవకాశాన్ని నిరాకరించడం కుదరదు. గవర్నర్‌కు అలాంటి అధికారాలు లేవు. అలాంటి అధికారాలు గనక గవర్నర్‌కో లేక రాష్ట్రపతికో ఉంటే అది ఘోరమైన విపరిణామాలకు దారితీస్తుంది' అంటూ చీఫ్ జస్టీస్ వైకే సభర్వాల్‌, జస్టిస్‌ బీఎన్‌ అగర్వాల్‌, జస్టిస్‌ అశోక్‌ భాన్‌ తమ తీర్పులో పేర్కొన్నారు.
 
ఇపుడు కర్ణాటక రాష్ట్రంలో ఈ తీర్పు బీజేపీకి ఏమాత్రం మింగుడుపడ లేదు. ఆనాడు సుప్రీం ఇచ్చిన తీర్పే ప్రస్తుతం కర్ణాటక గవర్నర్‌ వజూభాయ్‌ వాలా అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్నికలకు ముందు గానీ, తర్వాత గానీ పొత్తు పెట్టుకున్న కూటమికి మెజారిటీ ఉందని గవర్నర్‌ సంతృప్తి చెందిన పక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు మొదట ఆ కూటమినే పిలవాలి. కానీ, ఇపుడు గవర్నర్ అలా పిలవకుండా 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి అవకాశం ఇవ్వడం, కాంగ్రెస్ న్యాయస్థానం తలుపుతట్టడం జరిగిపోయింది. దీంతో కర్ణాటక రాజకీయాలు మరింత ఉత్కంఠతను రేపుతున్నాయి.