శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 జనవరి 2023 (19:04 IST)

కేంద్ర బడ్జెట్ 2023 తర్వాత భారీగా పెరగనున్న ఈ వస్తువుల ధరలు మరింత ప్రియం!

nirmala sitharaman
వచ్చే నెలాఖరులో కేంద్ర వార్షిక బడ్జెట్ 2023-24ను విత్తమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ తర్వాత పలు రకాల వస్తువుల ధరలు పెరిగే సూచనలు ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు ఇప్పటికే సంకేతాలు పంపించాయి. అందుకు అనుగుణంగా ప్రస్తుతం వార్షిక బడ్జెట్ రూపకల్పన సాగుతోంది. 
 
వివేకంతో ఆర్థిక నిర్వహణతో పాటు దీర్ఘకాల వృద్ధికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. దీర్ఘకాల లక్ష్యాల్లో భాగంగా బడ్జెట్ ప్లాన్స్‌లో కస్టమ్స్ డ్యూటీ పెంపు ఉండొచ్చని ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. కస్టమ్స్ డ్యూటీ పెంపు సాధ్యాసాధ్యలకు సంబంధించి మొత్తం 35 వస్తువుల జాబితాను కేంద్రం సిద్ధం చేస్తుందని పేర్కొంది. 
 
ఈ జాబితాలో అధిక విలువైన కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, కొన్ని ప్లాస్టిక్ వస్తువులు, నగలు, హై గ్లాస్ పేపర్, విటమిన్స్, ప్రైవేట్ జెట్స్, హెలికాఫ్టర్స్‌ తదితరాలు ఉన్నాయి. అదేసమయంలో దిగుమతులను గణనీయంగా తగ్గించి దేశీయంగా తయారీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం దృష్టిసారించింది. నిత్యావసరం కాని వాటిని ఎక్సైజ్ సుంకం పరిధిలోకి తేవాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనివల్ల అనవసర దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు, ఆదాయం పెంచుకునే వ్యూహం కనిపిస్తుంది.