శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (09:49 IST)

మంత్రివర్గం విస్తరణపై దృష్టిసారించిన ప్రధాని మోడీ.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్కరికి ఛాన్స్..

narendra modi
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారికి ఒక్కొక్కరికి చొప్పున అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా, ఈ నెలాఖరు నుంచి 2023-24 వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలకు ముందుగానే ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర వర్గాల సమాచారం. ఇందులో భారీ మార్పులు, చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
 
కాగా, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యేడాది మే 31వ తేదీన తొలి మంత్రివర్గం ఏర్పాటైంది. 2021లో జూలై ఏడో తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. ప్రధానమంత్రితో కలిసి 31 మంది కేబినెట్ మంత్రులు, ఇద్దరు స్వతంత్ర హోదా మంత్రులు, 45 మంది సహాయ మంత్రులతో ఏకంగా 78 మంది మంత్రులతో జంబో కేబినెట్‌ను ఆయన ఏర్పాటుచేశారు. 
 
ఈ నేపథ్యంలో ఈ యేడాది తెలంగాణాతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే, వచ్చే యేడాది ఏప్రిల్, మే నెలల్లో ఏపీ అసెంబ్లీతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఎన్నికలు జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించాలన్న సంకల్పంతో ఉన్నట్టు సమాచారం.