శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (18:23 IST)

చెన్నై వరదలపై హైకోర్టు ఆగ్రహం... నీళ్ల కోసం ఏడ్వాలి.. నీళ్ల కోసం చావాలి...

చెన్నై నగరంలో సంభవించిన వరదలపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నై మహానగరం న‌గ‌రం వ‌ర‌ద‌ల్లో చిక్కుకోకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో కార్పొరేష‌న్ అధికార యంత్రాంగం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ంటూ మండిపడింది. గత 2015 వరదల తర్వాత చెన్నైలో తీసుకున్న చర్యలు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. 
 
'ఏడాదిలో స‌గం రోజులు మేం నీళ్ల కోసం ఏడ్చేలా చేశారు. మిగిలిన సగం రోజులు మ‌మ్ముల నీళ్ల‌లో చ‌చ్చేలా చేశారు' అని గ్రేటర్ చెన్నై కార్పొరేష‌న్‌కు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ప్ర‌తి వ‌ర్షాకాలం న‌గ‌రం నీట మునుగుతున్నా న‌గ‌ర కార్పొరేష‌న్ ఎందుకు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలేద‌ని మొట్టికాయ‌లు వేసింది.
 
2015లో చెన్నై న‌గ‌రాన్ని భారీ వ‌ర‌ద‌లు ముంచెత్తాయ‌ని, అది జ‌రిగి ఐదు సంవ‌త్స‌రాలైన గ్రేట‌ర్ చెన్నై కార్పొరేష‌న్‌ వ‌ర‌ద‌ల‌ను నివారించే చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని చీఫ్ జ‌స్టిస్ సంజీవ్ బెన‌ర్జీ, జ‌స్టిస్ పీడీ ఆదికేశ‌వులు నేతృత్వంలోని ధ‌ర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
ఇప్ప‌టికైనా చెన్నైలో వ‌ర‌ద‌లు పోటెత్త‌కుండా న‌గ‌ర కార్పొరేష‌న్ చ‌ర్య‌లు తీసుకోక‌పోతే తాము ఈ కేసును సుమోటోగా స్వీక‌రిస్తామ‌ని న్యాయ‌స్థానం హెచ్చ‌రించింది. కాగా, గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై నగరం నీట మునిగివున్న విషయం తెల్సిందే.