కమనీయం కపిలేశ్వరాలయ జలపాతం..!
గత మూడురోజుల నుంచి టెంపుల్ సిటీ తిరుపతిలో ఎడతెరిపి లేని వర్షం పడతూనే ఉంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తుంటే.. చెరువులు సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఎటు చూసినా వర్షపునీరే కనిపిస్తోంది.
అయితే ఇప్పటికే నగర పాలకసంస్ధ అధికారులు ప్రజలను హెచ్చరించారు. పాతబడిన ఇళ్ళలో ఉండవద్దని సూచిస్తున్నారు. మరో వారంరోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
అయితే ఇదంతా పక్కన బెడితే తిరుపతిలో వర్షం పడితే చాలు తిరుమల క్షేత్రాల అందాలు ఎంతగానో కనువిందు చేస్తుంటాయి. ముఖ్యంగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే భక్తులకు దారిలో కపిలేశ్వర ఆలయం కనిపిస్తుంటుంది. ఆ ఆలయంలో జలపాతాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
శేషాచలం నుంచి వస్తున్న వర్షపునీటి ప్రవాహం ఎక్కువగా కనబడుతోంది. కొండల మధ్య నుంచి వస్తున్న వర్షపునీరు జలపాతాలను తలపిస్తోంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో పాటు స్థానికులు కూడా పెద్ద ఎత్తున కపిలేశ్వర ఆలయానికి చేరుకుని తిలకిస్తున్నారు.
అందులోను కార్తీక సోమవారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా కనిపిస్తోంది కపిలేశ్వర ఆలయంలో. ఒకవైపు జలపాతాల అందాలను చూస్తూ మరోవైపు ముక్కంటీశ్వరున్ని దర్సించుకుంటూ భక్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో వారంరోజుల పాటు వర్షం ఇలాగే నిరంతరాయంగా కొనసాగనున్న నేపథ్యంలో శేషాచలం కొండల అందాలు మరింతగా రెట్టింపుగా కనిపించే అవకాశం ఉందంటున్నారు టిటిడి అధికారులు.