శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (18:49 IST)

వస్త్రం మాస్క్ కంటే ఎన్95 లేదా కేఎన్95లే బెస్ట్

కరోనా వైరస్ గాలి ద్వారానే వ్యాపిస్తోంద‌న్న లాన్సెట్ అధ్య‌య‌నంపై ప్రముఖ అంటు వ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఫ‌హీమ్ యూన‌స్  ట్విట‌ర్‌లో స్పందించారు‌. దీనికి ప‌రిష్కారం మామూలు బ‌ట్ట‌తో చేసిన మాస్క్‌లు ధ‌రించ‌డం కంటే ఎన్‌95 లేదా కేఎన్‌95 మాస్క్‌లు ధ‌రించ‌డ‌మే అని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. 
 
రెండు మాస్క్‌లు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాల‌ని ఆయ‌న సూచించారు. లాన్సెట్ అధ్య‌య‌నం చూసి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. క‌రోనా వైర‌స్ స్పెక్ట్రం (తుంప‌ర్ల నుంచి గాలి ద్వారా)లో వ్యాపిస్తుంద‌ని మ‌న‌కు తెలుసు. దీనికి ప‌రిష్కారం ఒక ఎన్‌95, ఒక కేఎన్95 మాస్కులు ధ‌రించ‌డ‌మేనని చెప్పారు. 
 
వీటిని ఒక్కో రోజు ఒక్కొక్క‌టి వాడండి. ఒక‌టి వాడిన త‌ర్వాత దానిని పేప‌ర్ బ్యాగ్‌లో ఉంచి ఆ మ‌రుస‌టి రోజు వాడాలి. అవి పాడు కాక‌పోతే కొన్ని వారాల పాటు వాడుకోవచ్చు. బ‌ట్ట‌తో చేసిన మాస్క్‌లు వ‌ద్దు అని ఫహీమ్ యూన‌స్ ట్వీట్ చేశారు.
 
వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తున్నంత మాత్రాన మన బ‌య‌ట ఉన్న గాలి మొత్తం క‌లుషితం అయిపోయింద‌ని కాదు. దీనర్థం వైర‌స్ గాల్లోనే ఉండే అవ‌కాశం ఉన్న‌ద‌ని భావించాలి. ముఖ్యంగా నాలుగు గోడ‌ల మ‌ధ్య ఈ ముప్పు ఎక్కువ‌. ఒక‌వేళ ఆరు అడుగుల దూరం పాటిస్తూ ఉంటే మ‌న పార్కులు, బీచ్‌లు మాస్కులు పెట్టుకోకుండా కూడా చాలా సుర‌క్షితం అని యూన‌స్ చెప్ప‌డం విశేషం. 
 
ఇదిలావుండగా, కరోనా మహమ్మారిని నియంత్రించాలంటే, కేవలం ఒక్క మాస్క్ పెట్టుకుంటే సరిపోదని, రెండు మాస్క్‌లు పెట్టుకోవాల్సిందేనని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా హెల్త్ కేర్ నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. 
 
ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా వైరస్ నియంత్రణ క్లిష్టతరమైన సమయంలో, డబుల్ మాస్క్‌ను ధరించడం వల్ల ముక్కు ద్వారా వైరస్ లోపలికి వెళ్లకుండా చేయవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అధ్యయన ఫలితాలను జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ ప్రచురించింది.
 
రెండు మాస్క్ లను ధరిస్తే, వైరస్ శరీరం లోపలికి వెళ్లలేదని తేల్చిన పరిశోధకులు, ఒక మా‌స్క్‌లో పొరల సంఖ్యను పెంచడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. మాస్క్‌లలో ఉన్న ఖాళీలు పూడ్చి, ముఖానికి బిగుతుగా ఉంటేనే వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. 
 
ఓ సర్జికల్ మాస్క్‌‌తో కలిపి, వస్త్రంతో తయారు చేసిన మాస్క్‌ను ధరిస్తే కరోనా వైరస్‌కు దూరంగా ఉండవచ్చని, ముఖాల్లో తేడాను బట్టి కూడా మాస్క్‌ల సామర్థ్యం భిన్నంగా ఉంటుందని గుర్తించామని ఆయన తెలిపారు. 
 
ఇక వదులుగా ఉండే మాస్క్‌లతో ఏ మాత్రమూ ఉపయోగం ఉండదని, ఇదేసమయంలో ముక్కు, మూతిని మూసేసేలా అమరే ఒక్క మాస్క్ అయినా మెరుగైన ఫలితాలను పొందవచ్చని ఎమ్లీ సిక్ బెర్డ్ బెన్నెట్ వ్యాఖ్యానించారు. వైరస్‌ను నివారించాలంటే, మాస్క్ ధరించడం అత్యంత ముఖ్యమని తమ అధ్యయనంలో వెల్లడైనట్టు తెలిపారు.