1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (15:23 IST)

తమిళ సీఎం అక్రమ వ్యవహారం నుండి పుట్టిన శిశువు- రాజా: ఎడప్పాడి కన్నీటి పర్యంతం

తమిళనాడు రాజకీయాల ప్రచారపర్వం చివరికి వచ్చేసింది. ఐతే రాజకీయ నాయకుల మాటలు కూడా తూటాల్లా పేలుతున్నాయి. డిఎంకె ఎంపి ఎ రాజా చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
రాజా వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఎడప్పాడి కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తల్లి ఓ మారుమూల గ్రామంలో వుండేదనీ, అలాంటి తల్లికి పుట్టిన నేను ముఖ్యమంత్రి పదవికి అర్హుడిని కానా... ఓ తల్లిని కించపరుస్తూ మాట్లాడేవారు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో వేరే చెప్పక్కర్లేదు. ఇలాంటి వారికి దేవుడు తగిన శిక్ష విధిస్తాడంటూ తిరువొత్తియూరు ఎన్నికల ప్రసంగంలో అన్నారు.
 
ఎడప్పాడిపై రాజా వ్యాఖ్యలను అటు డీఎంకే చీఫ్ స్టాలిన్ సైతం ఖండించారు. కాగా తన వ్యాఖ్యలు ముఖ్యమంత్రిని బాధిస్తే భేషరతుగా క్షమాపణలు చెపుతున్నట్లు రాజా పేర్కొన్నారు. ఇంతకీ రాజా చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే... నా ప్రసంగం ఇద్దరు నాయకుల వ్యక్తిగత పోలిక గురించి కాదు, ప్రజా జీవితంలో ఇద్దరు నాయకుల పోలిక గురించి. “డిఎంకె ప్రెసిడెంట్ స్టాలిన్- ఎడప్పాడి కె పళనిస్వామిని ఇద్దరినీ పోల్చి చూడండి. 23 సంవత్సరాలలో స్టాలిన్ మిసా యాక్ట్ వచ్చినప్పుడు జైలుకు వెళ్ళాడు. అప్పుడు ఆయన పార్టీలో జిల్లా కార్యదర్శి, జనరల్ కమిటీ సభ్యుడు, యూత్ వింగ్ సెక్రటరీ, కోశాధికారి, అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తరువాత డిఎంకె అధ్యక్షుడిగా పనిచేశారు.
 
ఇలా ఆయన దశలవారీగా నాయకుడయ్యారు. ఎమ్మెల్యేగా పనిచేశాడు, చెన్నై మేయర్ గానూ, రాష్ట్ర మంత్రి, డిప్యూటీ సిఎం, ఇప్పుడు సిఎం అవ్వబోతున్నాడు. అందుకే స్టాలిన్ ఒక 'సరైన' వివాహం ద్వారా నాయకుడయ్యారు. ఎడప్పాడి పళనిస్వామి - జయలలిత మరణించే వరకు ఎవరికీ తెలియదు. ప్రజా జీవితంలో ఎన్నడూ ఆయనను మనం చూడలేదు. రాజకీయాల్లో అక్రమ వ్యవహారం నుండి పుట్టిన అకాల శిశువు ఎడప్పాడి." అన్నారు. రాజా చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. అన్నాడీఎంకె శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా డిఎంకె నుంచి కూడా ఆయనకు ఎదురుగాలి వీచింది. దీనితో రాజా క్షమాపణలు చెప్పారు.