ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (12:07 IST)

రాయ్‌చూర్‌కు చెందిన ఐదేళ్ల బాలికలో జికా వైరస్... తొలి కేసుగా నమోదు

Zika
కర్నాటక రాష్ట్రంలోని రాయ్‌చూర్‌లో ఐదేళ్ల బాలికలో జికా వైరస్‌ను వైద్యులు గుర్తించారు. ఇది ఆ రాష్ట్రంలో నమోదైన తొలి కేసు కావడం గమనార్హం. మన దేశంలో జికా వైరస్ తొలిసారి కేరళ రాష్ట్రంలో వెలుగు చూసిన విషయం తెల్సిందే. ఇపుడు అది కర్నాటక రాష్ట్రానికి వ్యాపించింది. ఐదేళ్ళ బాలికకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో జికా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని కర్నాటక వైద్య ఆరోగ్య శాఖామంత్రి కె.సుధాకర్ తెలిపారు. 
 
ఈ బాలిక రక్త నమూనాలను సేకరించి పూణెలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపించగా, అక్కడ జరిపిన పరీక్షల్లో జికా వైరస్ సోకినట్టు తేలిందన్నారు. ఇది కర్నాటకలో నమోదైన తొలి కేసు అని, పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తుందని తెలిపారు. ఈ నెల 5వ తేదీన పూణె ల్యాబ్‌కు పంపించగా, ప్రయోగ ఫలితాలు ఈ నెల 8వ తేదీన వచ్చాయని తెలిపారు. 
 
ఇదే అంశంపై మంత్రి సుధాకర్ మాట్లాడుతూ, మన దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత కేరళ రాష్ట్రంలో జికా వైరస్ తొలిసారి వెలుగు చూసిందన్నారు. ఆ తర్వాత ఇది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లకు వ్యాపించగా, ఇపుడు కర్నాటకలో వెలుగు చూసిందన్నారు. 
 
బాధితురాలికి ఎలాంటి స్వదేశీ లేదా విదేశీ పర్యటనలు లేవన్నారు. కానీ, ఆ బాలిక నివసించే ఇంటి పరిసరాల్లో ఉండే దోమలు కుట్టడం వల్లే ఈ వైరస్ సోకివుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ దోమే డెంగీ, చికెన్ గున్యా వంటి వాటిని వ్యాపింపజేస్తుందని మంత్రి సుధాకర్ తెలిపారు.