శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (10:51 IST)

బంగారు పతకం సాధించిన ఎలుక, ఎందుకో తెలుసా?

కంబోడియాలో దశాబ్దాల కింద పాతిపెట్టిన వేలాది మందుపాతరలను వెతికేందుకు ఆ మూషికాలు సిద్ధమయ్యాయి. జాగిలాలకు ఏమాత్రం తీసిపోని ఈ ఎలుకలు.. ఇప్పుడు కార్యక్షేత్రంలోకి దిగాయి. మందుపాతరలను గుర్తించే అసమాన సామర్థ్యం శునకాలకే కాదు.. తమకూ ఉందని ఈ ఎలుకలు రుజువు చేస్తున్నాయి. కఠిన శిక్షణలో రాటుదేలి.. తమ దేశ పౌరుల ప్రాణాలు రక్షించేందుకు సమాయత్తమయ్యాయి.
 
కంబోడియాలో పాతిపెట్టిన వేలాది మందుపాతరలను వెలికితీసేందుకు 20 మూషికాలు సిద్ధమయ్యాయి. వీటిని విధుల్లో నియమిస్తూ కంబోడియా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. టాంజానియా నుంచి దిగుమతి చేసుకున్న 20 ఆఫ్రికన్‌ జాతికి చెందిన పర్సూ ఎలుకలకు మందుపాతరలను గుర్తించడంలో కఠిన శిక్షణ ఇచ్చారు. ఈ మూషికాలతో పనిచేయడం చాలా సులభమని.. అవి తమ పనుల్లో నిమగ్నమై వేగంగా మందుపాతరల్ని గుర్తించగలవని వాటికి శిక్షణ ఇచ్చిన ఓ అధికారి తెలిపారు. ఇటీవలే పదవీ విరమణ చేసిన మూషికాల ఖాళీలను ఈ ఎలుకలు భర్తీ చేయనున్నాయి.
 
కంబోడియాలో ఎన్నో ప్రమాదకరమైన ల్యాండ్‌మైన్లను వెలికితీయడంలో కీలక పాత్ర పోషించిన ‘మగావా’ అనే మూషికం ఇటీవలే పదవీ విరమణ చేసింది. ఐదేళ్ల నిరుపమాన సేవల అనంతరం రిటైరైంది. ‘హీరో ర్యాట్‌’గా గుర్తింపు పొందిన మగావా 71 మందుపాతరలు, 38 ఇతర పేలుడు పదార్థాలను పట్టించింది. దాని ధైర్యసాహసాలకు, విధి నిర్వహణలో చూపించిన అంకితభావానికి మగావాకు బ్రిటన్‌కు చెందిన జంతు కారుణ్య సంస్థ (పీడీఎస్‌ఏ) బంగారు పతకాన్ని అందజేసింది. కంబోడియాలో 1970-80 కాలంలో జరిగిన అంతర్యుద్ధ సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో దాదాపు 60 లక్షల ల్యాండ్‌మైన్లను పాతిపెట్టారని ఓ అధ్యయనం తెలిపింది.