కరణం మల్లేశ్వరిని అభినందించిన గవర్నర్ హరిచందన్

karanam malleswari
ఎం| Last Modified గురువారం, 24 జూన్ 2021 (23:42 IST)
ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రప్రథమ క్రీడా విశ్వవిద్యాలయం ఉప కులపతిగా నియమితులైన ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. ఒలింపిక్ పతకం సాధించిన తొలి, ఏకైక భారతీయ మహిళా వెయిట్ లిఫ్టర్ గా కరణం మల్లేశ్వరికి తగిన గౌరవం దక్కిందన్నారు.

2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన మల్లేశ్వరి ప్రతిభను దేశ పౌరులు ఎల్లప్పటికీ గుర్తుంచు కుంటారని గవర్నర్ ప్రస్తుతించారు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లు మొదలైన వాటిలో 11 బంగారు పతకాలు సహా 29 అంతర్జాతీయ పతకాలు సాధించి, అర్జున, పద్మశ్రీ,
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులను అందుకున్న మల్లేశ్వరి దేశంలోని క్రీడాకారులకు ప్రేరణగా నిలిచారని ప్రశంసించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన
మల్లేశ్వరి దేశంలోని తొలి క్రీడా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా నియమించబడటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వించదగ్గ సందర్భమన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.
దీనిపై మరింత చదవండి :