శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (15:45 IST)

నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత.. జల వివాదంపై కిషన్ రెడ్డి కేంద్రానికి లేఖ

Nagarjuna Sagar
నాగార్జున సాగర్ డ్యాం వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కృష్ణా నది నీటి పంపకాలపై ఏపీ, తెలంగాణల మధ్య మళ్లీ వివాదం నెలకొంది. డ్యామ్‌పై తమకు సమాన హక్కులున్నాయంటూ ఏపీ పోలీసులు బుధవారం రాత్రి బలవంతంగా డ్యామ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
 
డ్యాం 13వ గేటు దగ్గర ముళ్ల కంచె ఏర్పాటు చేయడంతో పాటు కుడి కాలువ ద్వారా ఏపీకి నీటిని విడుదల చేశారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. 
 
డ్యామ్‌కు ఇరువైపులా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌ డ్యామ్‌ పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. 
 
ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణాజలాల పంపకాల అంశం మళ్లీ ఉద్రిక్తంగా మారడంతో కేంద్రమంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సాగర్ జల వివాదంపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. 
 
రెండు రాష్ట్రాల మధ్య సాగర్ నీటి తరలింపు విషయంలో మరోసారి వివాదం తలెత్తడంతో కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కూడా కేంద్ర జలవిద్యుత్ శాఖకు నివేదిక పంపనుంది. మరోవైపు నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద జరుగుతున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. 
 
వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు డ్యామ్ వద్దకు వెళ్లాలని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను ఆదేశించారు. మరికొద్ది సేపట్లో తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు నాగర్జన సాగర్ డ్యాం వద్దకు వెళ్లనున్నారు.