గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (15:00 IST)

రాళ్ళతో దాడిచేసుకున్న భారత్ - చైనా సైనికులు... ప్రాణ నష్టం

భారత్ - చైనా దేశాల మధ్య మళ్లీ సరిహద్దు ఉద్రిక్తతలు చెలరేగాయి. లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఓ అధికారితో సహా ముగ్గురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, పలువురు చైనా సైనికులు కూడా గాయపడినట్టు సమాచారం. ఫలితంగా ఇరు దేశాల సరిహద్దుల్లో ఘర్షణపూరిత వాతావరణ నెలకొంది. 
 
నిజానికి గత కొన్ని వారాలుగా లడఖ్ ప్రాంతంలో ఇండోచైనా సైనికుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. దీనిపై ఇరుదేశాల ఉన్నతస్థాయి సైనికాధికారులు చర్చలు జరిపినా పరిస్థితులు చక్కబడలేదు. పైగా, సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు రాళ్ళతో దాడి చేసుకున్నట్టు సమాచారం. ఈ దాడి ఘటనతో సరిహద్దు వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 
 
గాల్వన్ లోయ వద్ద జరిగిన దాడి ఘటనపై భారత ఆర్మీ స్పందించింది. గత రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, భారత్, చైనా సైనికులు పరస్పరం రాళ్లతో కొట్టుకున్నారని వెల్లడించింది. 
 
ఈ దాడిలో ఓ సైనికాధికారి, మరో ఇద్దరు జవాన్లను భారత్ కోల్పోయిందని, అటు చైనా సైనికులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. మన సైనికులు సంయమనం పాటించినా తొలుత చైనా సైనికులే రెచ్చగొట్టారని భారత ఆర్మీ ఆరోపించింది.
 
కాగా, నెలన్నర రోజులుగా లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా దళాలు మోహరించి ఉన్నాయి. గాల్వాన్ లోయ, పాంగోంగ్ త్సోలోని నియంత్రణ రేఖ వద్ద చైనా సైనిక శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. చైనా సైనికులు సరిహద్దుల్లో ఉనికిని పెంచుకున్న నేపథ్యంలో భారత సైనిక దళాలు, వాహనాలు, ఫిరంగి తుపాకులను తూర్పు లడఖ్‌కు పంపించినట్లు కేంద్రం తెలిపింది.